core committe: రాష్ట్ర బీజేపీలో కోర్ కమిటీ అంటే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కమిటీ మొదలుకొని జిల్లా, మండల కమిటీలు ఆచరణలో పెడతాయి. డాక్టర్ లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కమిటీలో ఐదుగురు నేతలు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. అప్పటి అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు, మురళీధర్‌రావు, కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీనివాస్‌లతో కోర్ కమిటీ ఉండేది. వీరితో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆహ్వానిత సభ్యులుగా ఉండేవారు. పార్టీ పాలసీ నిర్ణయలు కానీ, పార్టీ బలోపేతానికి, ఏదైనా అంశంపై కార్యాచరణ చేపట్టాలన్నా కోర్ కమిటీ సమావేశం తప్పనిసరి. పార్టీ జాతీయ స్థాయి నేతలు ఎవరైనా వస్తే కోర్ కమిటీతోనే సమావేశాలు నిర్వహించి వెళ్లేవారు.
కోర్ కమిటీ చూసి కంగుతిన్న అమిత్ షా:
ఐదుగురితో మొదలైన ఈ కమిటీలో రానురాను 23 మంది వరకు సభ్యులుగా తీసుకున్నారు. రాష్ట్ర పార్టీలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు కోర్ కమిటీలో చోటు కల్పించాల్సి వచ్చిందని అంటున్నారు. తమను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కీలక నిర్ణయాధికారం ఉన్న కోర్ చోటు కల్పించడంపై అప్పట్లో లక్ష్మణ్‌ను ప్రశ్నించారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా కోర్ కమిటీని చూసి తెగ ఆశ్చర్యపోయారంట. కోర్ కమిటీ సభ్యులుగా ఇక ఎవరినీ తీసుకోవద్దని చెప్పేశారని అప్పట్లో టాక్.
కోర్ కమిటీ మనుగడలో ఉందా? లేదా?
ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. ఈ కోర్ కమిటీ మనుగడలో ఉందా? లేదా? అనే అంశంపై పార్టీలో చర్చ మొదలైంది. ఇప్పటికి కొంతమంది నేతలు కోర్ కమిటీ సభ్యులమని చెప్పుకుంటుండగా, మరికొందరు మాత్రం కోర్ కమిటీ రద్దయ్యిందని అంటున్నారు. రాష్ట్ర కమిటీ రద్దయిన మరుక్షణమే డిఫాల్ట్‌గా కోర్ కమిటీ సైతం రద్దవుతుందని చెబుతున్నారు. కోర్ కమిటీయే ఉంటే గత ఎనిమిది నెలలుగా ఒక్కసారి కూడా ఎందుకు సమావేశం కాలేదని ప్రశ్నిస్తున్నారు. కోర్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది అధ్యక్షుడి విచక్షణపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
బండి సంజయ్ ఏం నిర్ణయిస్తారో?
కోర్ కమిటీ రద్దయినా ఇంకా కోర్ కమిటీ సభ్యుడినంటూ చెప్పుకోవడాన్ని కొందరు నాయకులు తప్పు పడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం వారిని చూసీ చూడనట్లు వ్యహరిస్తున్నారని అంటున్నారు. అసలు ఈ విషయంలో ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు గతంలో కోర్ కమిటీలో స్థానం దక్కని కాషాయ పార్టీ నేతలు. మరి సంజయ్ కొత్త కోర్ కమిటీ ఏర్పాటుకు మొగ్గు చూపిస్తారో.. అసలు కమిటీయే వద్దనుకొని పక్కన పెట్టేస్తారో? వేచి చూడాల్సిందే.