ఆపరేషన్ ఆకర్ష్ : బీజేపీలోకి విక్రమ్ గౌడ్ ? గల్లీలో నడ్డా ప్రచారం

  • Published By: madhu ,Published On : November 27, 2020 / 07:00 AM IST
ఆపరేషన్ ఆకర్ష్ : బీజేపీలోకి విక్రమ్ గౌడ్ ? గల్లీలో నడ్డా ప్రచారం

Updated On : November 27, 2020 / 10:27 AM IST

Mukesh Goud Son Vikram Goud Likely Join in BJP : గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఆ పార్టీ అగ్రనేతలు, ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ గల్లీల్లో ప్రచారం నిర్వహించనున్నారు. నడ్డా ప్రచారానికి వస్తుండటంతో కమలం నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. జాతీయ అధ్యక్షుడి ప్రచారం కోసం బీజేపీ కూడా గట్టిగానే ఏర్పాట్లు చేసింది.



గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు కీలక నేతల కమలం పార్టీ కండువా కప్పుకోగా.. మరికొందరు ఆ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌… బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీపై అసంతృప్తితో ఉన్న విక్రమ్‌గౌడ్‌ బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. 2020, ఆయన కమలం తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉంది.



https://10tv.in/ghmc-election-2020-trs-vs-bjp-dialogue-war/
బీజేపీ నేత డీకే అరుణ…. విక్రమ్‌గౌడ్‌ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. 20నిముషాలపాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. విక్రమ్‌గౌడ్‌ ప్రస్తుతం గోషామహల్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. తన తండ్రి ముఖేష్ గౌడ్ చనిపోయినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తమను, తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని విక్రమ్‌గౌడ్‌ భావిస్తున్నారు.



కాంగ్రెస్‌ నేతలు విక్రమ్‌గౌడ్‌ను బుజ్జగించే పనిలో పడ్డారు. డీకే అరుణ కంటే ముందే విక్రమ్‌గౌడ్‌ నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. పార్టీలోనే ఉండాలని తగిన ప్రాధాన్యం దక్కేలా చూస్తామని చెప్పారు. విక్రమ్‌గౌడ్‌కు పార్టీలో కొంత అన్యాయం జరగడం వాస్తవమే అయినా ఆయన పార్టీ మారబోరన్నారు వీహెచ్‌. బీజేపీ తమ నేతలకు వలవేస్తోందని ఆరోపించారు.