V Srinivas Goud : బీసీలపై ప్రేమే ఉంటే మీ పార్టీ అధ్యక్షుడిని ఎందుకు మార్చారు? మీరు 4 సీట్లు కూడా గెలవరు- మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇద్దరు బీసీ బిడ్డలకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా అడ్డుకున్న బీజేపీ.. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదం. V Srinivas Goud

V Srinivas Goud Slams BJP (Photo : Twitter)
V Srinivas Goud Slams BJP : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తాం అంటూ బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. బీసీలపై కపట ప్రేమ నటిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇద్దరు బీసీ బిడ్డలకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా అడ్డుకున్న బీజేపీ.. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదం అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మాజీమంత్రి పి చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. బీజేపీపై విరుచుకుపడ్డారు.
బండి సంజయ్ ని ఎందుకు తప్పించారు?
”బీసీ ప్రధాన మంత్రి కాగానే మా వర్గాలకు మేలు జరుగుతుందని అనుకున్నాం. కానీ, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తారట. బీసీలపై ప్రేమ ఉంటే మీ పార్టీ బీసీ అధ్యక్షుడిని ఎందుకు మార్చారు? బీజేపీ వాళ్ళు నాలుగు సీట్లు కూడా గెలవరు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయి.
Also Read : కాంగ్రెస్‌కు షాక్.. అనూహ్యంగా కారు ఎక్కిన మాజీ ఎమ్మెల్యే
90 స్థానాల్లో గెలుస్తున్నాం..
శాసనమండలిలో బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చాం. ఇద్దరు బీసీ బిడ్డలకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా అడ్డుకున్న బీజేపీ.. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదం. 90కి పైగా స్థానాలు బీఆర్ఎస్ గెలవబోతుంది. గెలవని స్థానాల్లో బీసీలకు కాంగ్రెస్ సీట్లు ఇస్తోంది. వ్యవసాయం దండగ అని ఈ రెండు పార్టీలు అన్నాయి” అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.

P Chandra Shekar
అందుకే.. కేసీఆర్ ముదిరాజ్ లకు టికెట్లు ఇవ్వలేదు- పి.చంద్రశేఖర్, మాజీమంత్రి
ఇక మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి పి చంద్రశేఖర్ బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. ”బండ ప్రకాశ్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచన మేరకు కేసీఆర్ అనుమతితో పార్టీలో చేరుతున్నా. తెలంగాణ సాధించాక గతంలో అనివార్య కారణాల వల్ల పార్టీ వీడాను. ఇప్పుడు సొంత ఇంటికి వచ్చినట్లు ఉంది. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉంటా. బీజేపీలో నాకు కనీస మర్యాద ఇవ్వలేదు. అందుకే రాజీనామ చేసి వచ్చాను. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల. గత 9ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ చేపట్టారు. ముదిరాజ్ లకు అనివార్య కారణాల వల్లే కేసీఆర్ టికెట్లు ఇవ్వలేదు.
Also Read : డబ్బునోళ్లకు టికెట్లు ఇస్తున్నారు, అందుకే బీఆర్ఎస్‌లోకి- కాంగ్రెస్‌పై నాగం జనార్ధన్ రెడ్డి ఫైర్
బీఆర్ఎస్ ను ముదిరాజ్ లు నిందించొద్దు- చంద్రశేఖర్
సిట్టింగ్ లలో ముదిరాజ్ లు లేనందునే ముదిరాజ్ లకు టికెట్ రాలేదు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ముదిరాజ్ లకు కూడా అందుతున్నాయి. అనవసరంగా బీఆర్ఎస్ ను ముదిరాజ్ లు నిందించొద్దు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని ముదిరాజ్ లు అందరూ ఏకతాటిపై ఉండి నిలబెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో ముదిరాజ్ లకు ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో అవకాశాలు వస్తాయి. నేను కూడా కింది స్థాయి నుండే ఎదుగుతూ వచ్చాను. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గెలుపు కోసం కృషి చేస్తా” అని చంద్రశేఖర్ అన్నారు.