బోయిన్ పల్లి కిడ్నాప్ : అఖిల ప్రియకు, గుంటూరు శ్రీనుకు మధ్య రిలేషన్ ఏంటీ ? అసలు ఎవరు గుంటూరు శ్రీను ?

బోయిన్ పల్లి కిడ్నాప్ : అఖిల ప్రియకు, గుంటూరు శ్రీనుకు మధ్య రిలేషన్ ఏంటీ ? అసలు ఎవరు గుంటూరు శ్రీను ?

Updated On : January 15, 2021 / 12:19 PM IST

Bowenpally Kidnapping : కిడ్నాప్‌ ఆలోచన అఖిల ప్రియదే అయినా.. పక్కా స్కెచ్‌తో స‌క్సెస్ చేసింది మాత్రం గుంటూరు శ్రీనే. అఖిలప్రియకు, గుంటూరు శ్రీనుకు మధ్య రిలేషన్‌ ఏంటీ? అసలీ గుంటూరు శ్రీను ఇంతకుముందు చేసిన సెటిల్‌మెంట్లు ఏంటీ..? అసలు ఎవరీ గుంటూరు శ్రీను? మాదాల శ్రీను… మాజీ మంత్రి అఖిల ప్రియ‌, ఆమె భర్త భార్గవ్ రామ్ కీల‌క అనుచ‌రుడు.. భూమ నాగిరెడ్డి మరణించిన త‌రువాత ఆళ్లగ‌డ్డలో అన్ని తానై చూసుకుంటున్న సమయంలో.. ఈ శ్రీను వారి కీల‌క అనుచ‌రుడిగా మారిపోయాడు. ఆ సమయంలోనే కొన్ని భూసెటిల్‌మెంట్లు చేశాడు.. వీటితో పాటు, ఆర్థిక పరమైన అంశాల్లో మాదాల శ్రీను కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.

ఏవీ సుబ్బారెడ్డి హత్యాయత్నం : –
భూమా అఖిలప్రియ కుటుంబానికి.. ఏవీ సుబ్బారెడ్డి కుటుంబానికి మధ్య వివాదాలు తలెత్తిన సమయంలో… మాదాల శ్రీను టీం ప‌లు ఆప‌రేష‌న్లు చేశాయి. గతంలో ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించేందుకు భూమా అఖిలప్రియ ప్రయత్నించారని… 2020 మార్చిలో కేసు నమోదైంది. ఆ కేసులో దర్యాప్తులో మాదాల శ్రీను వ్యవహరం బయటకు వచ్చింది. హైద‌రాబాద్ లోని కొన్ని ఆస్తుల వ్యవ‌హ‌రంపైనే భూమా-ఏవీ సుబ్బారెడ్డి మధ్య వివాదాలు వ‌చ్చాయని ప్రచారంలో ఉంది. దీంతో మాదాల శ్రీను గ్యాంగ్ హైద‌రాబాద్‌లో దిగి.. హ‌ఫిజ్ పేట్ ల్యాండ్ వ్యవ‌హ‌రంలోనే ఏవి సుబ్బారెడ్డిపై హత్యాప్రయత్నం వరకు వెళ్లారు. ఈ హ‌ఫీజ్ పేట్ ల్యాండ్ వ్యవ‌హ‌రంలోనే ప్రస్తుతం ముగ్గురిని కిడ్నాప్ చేశారు. ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసు ఇంకా విచారణలో ఉంది. సుబ్బారెడ్డి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి, సుపారీ గ్యాంగ్ సభ్యులను ఆయన నివాసానికి తీసుకువచ్చింది మాదాల శ్రీనునే అని పోలీసుల విచార‌ణాలో బ‌య‌ట‌ప‌డింది. ఏవి సుబ్బారెడ్డి ఇంటి ద‌గ్గర‌ ఎలా ఎటాక్ చేయాలి..? ఎలా తప్పించుకోవాలి..? అని పూర్తిగా ప్లాన్ చేసి సుపారీ గ్యాంగ్‌కు రూట్ మ్యాప్ ఇచ్చింది ఈ శ్రీనునే.. ఈ కేసులో ప‌లువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.. ఈ కేసులోనే మాదాల శ్రీను రెండు నెల‌లు క‌డ‌ప జైల్లో శిక్ష అనుభ‌వించి, బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

సెటిల్ మెంట్ లో ఆరితేరిన శ్రీను : –
ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసు దర్యాప్తు కొనసాగుతున్న స‌మ‌యంలోనే.. బోయిన్‌పల్లి కిడ్నాప్ గ్యాంగ్‌కు లీడ్ తీసుకున్నాడు మాదాల శ్రీను. స్పెషల్ 26 సినిమాను ప్రేర‌ణ‌గా తీసుకున్న శ్రీను.. సినిమా స్టైల్‌లో ఐటీ అధికారులుగా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని… వారందరిని దగ్గరుండి ప్రవీణ్ రావు, సునీల్, న‌వీన్ రావ్ ల నివాసానికి పంపించాడు.. ఇలా ఈ కిడ్నాప్‌ స్కెచ్‌లో కీలకంగా వ్యవహరించాడు శ్రీను. ఒక్క బోయిన్‌పల్లి కిడ్నాప్‌, ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో మాత్రమే కాదు.. వివాదస్పద భూముల సెటిల్‌మెంట్ల వ్యవహారాలన్నింటిలో భార్గవ్ రామ్‌కు ఈ మాదాల‌ శ్రీనే కుడి భుజంగా వ్యవహ‌రించిన‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో వెల్లడవుతోంది.. మాదాల శ్రీను గత నేర చరిత్ర పైన కూడా పోలీసులు ఇప్పటికే కూపీ లాగుతున్నారు.. పలు భూవివాదాలు ఆర్థిక లావాదేవీల సెటిల్మెంట్ లో శ్రీను ఆరితేరినట్లు పోలీసులు గుర్తించారు.. పలు సెటిల్మెంట్ విష‌యాల్లో కిడ్నాప్‌ల‌కు పాల్పడిన‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో వెల్లడైంది. వీటితోపాటు చిన్న చిన్న సెటిల్మెంట్లకు కొన్ని టీంల‌ను మెయింటేన్‌ చేస్తున్నాడు శ్రీను.. మాదాల శ్రీను లైఫ్ స్టైల్‌ కూడా చాలా లగ్జరీగా ఉంటుందని ఇప్పటికే బయటికొచ్చిన వీడియోలు, ఫోటోలు చూస్తే అర్థమవుతోంది.. సరదాలకు హెలికాప్టర్లో తిరగడం.. విదేశీ యాత్రలు చేయడం లాంటివి చాలానే ఉన్నాయని తెలుస్తోంది..

మాదాల శ్రీనివాస్ నేర చరిత్ర : –
గతంలో ఏ వి సుబ్బారెడ్డి పైన హత్యా ప్రయత్నం జ‌రిగ‌న తర్వాత కూడా ఆ గ్యాంగ్‌ను తీసుకొని మాదాల శ్రీను నేరుగా గోవాకు వెళ్లాడు.. మ‌ళ్లీ ఇప్పుడు కిడ్నాప్ అనంతరం కూడా నేరుగా భార్గవ్ రామ్ ఇతర కీలక సభ్యులను తీసుకొని గోవాలో ఎంజాయ్ చేస్తున్నాడు. గోవాలోనే పోలీసులు మాదాల శ్రీను, భార్గవ్ రామ్‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌ విషయం సంచలనం కావడంతో అఖిలప్రియ వారిని వదిలేయాలని శ్రీనుకు సూచించిందని పోలీసులు గుర్తించారు..ఒక వేళ అదే జరగకపోయింటే మాదాల శ్రీను లాంటి కరుడుకట్టిన నేర చరిత్ర కలిగిన వ్యక్తి వాళ్లని ఏం చేసి ఉండేవాడు…? ఎక్కడికి తీసుకెళ్లేవాడు..? అన్న దానిపై ఇప్పుడు చ‌ర్చ కొన‌సాగుతుంది. ఏదిఏమైనా భూమా అఖిలప్రియ కుటుంబానికి కుడిభుజంగా వ్యవహరిస్తున్న మాదాల శ్రీనివాస్ నేరచరిత్ర పై పోలీసుల కూపీ లాగుతుంటే.. సంచలన విషయాలు బయటపడుతున్నాయి..