Mla Padi Kaushik Reddy : ఆ 10 మంది ఎమ్మెల్యేలను బయట తిరగనివ్వం- పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్..

కేసీఆర్ ను విమర్శిస్తుంటే, నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే.. మేము చూస్తూ ఊరుకోము.

Mla Padi Kaushik Reddy : ఆ 10 మంది ఎమ్మెల్యేలను బయట తిరగనివ్వం- పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్..

Updated On : January 12, 2025 / 7:19 PM IST

Mla Padi Kaushik Reddy : కరీంనగర్ లో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య కొట్లాట జరిగింది. జిల్లా సమీక్ష సమావేశంలో కౌశిక్ రెడ్డి, సంజయ్ ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రికత్త చోటు చేసుకుంది. జిగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఉండగా.. ఎమ్మెల్యే కౌశిక్ అడ్డుకున్నారు. నీది ఏ పార్టీ, నువ్వు ఏ పార్టీలో ఉన్నావ్ అంటూ సంజయ్ ను నిలదీయడంతో గొడవ జరిగింది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. పరస్పరం తోసుకున్నారు. అక్కడే ఉన్న ఇతర ఎమ్మెల్యేలు వారించే ప్రయత్నం చేసినా కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. గొడవ మరింత పెద్దదిగా మారుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. బలవంతంగా కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లిపోయారు. కేసీఆర్ వల్ల గెలిచిన సంజయ్ కుమార్.. అమ్ముడుపోయి పార్టీ మారారని పాడి కౌశిక్ ఫైర్ అయ్యారు. దమ్ముంటే.. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సంజయ్ కుమార్ ను డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి.

Also Read : రైతు భరోసా మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. వారు మాత్రమే అర్హులు

దమ్ముంటే.. కాంగ్రెస్ గుర్తుపై గెలవాలని సవాల్..
బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ తరఫున మాట్లాడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి గెలవాలని సంజయ్ కు సవాల్ విసిరారు పాడి కౌశిక్ రెడ్డి. మరోవైపు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు కౌశిక్ రెడ్డి. మూడేళ్లలో కేసీఆర్ సీఎం అవుతారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారుల సంగతి తేలుస్తాం అంటూ హెచ్చరించారు.

మీరు బెదిరిస్తే భయపడను..
”ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని.. మంద బలం ఉందని.. అధికార బలం ఉందని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు బెదిరిస్తే భయపడే వారు ఎవరూ ఇక్కడ లేరు. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతున్నా. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా. అలాంటి నన్ను పట్టుకుని బయటకు నూకేశారు.

కేసీఆర్ భిక్షతో ఎమ్మెల్యే అయ్యారు..
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఒక దొంగ. ఆయన అమ్ముడుపోయారు. ఎలా అమ్ముడుపోయారు అని మేమే అడిగితే.. మైకు తీసుకుని.. నేను కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మరి, నిజంగా దమ్ముంటే.. సంజయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి చూపాలి. కేసీఆర్ పెట్టిన భిక్షతో ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు అదే కేసీఆర్ ను విమర్శిస్తుంటే, నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే.. మేము చూస్తూ ఊరుకోము. కచ్చితంగా నిలదీస్తాం. అధికారులూ.. తస్మాత్ జాగ్రత్త. ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.

ఆ ఎమ్మెల్యేలను బయట తిరగనివ్వం..
మూడేళ్ల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కాక తప్పదు. ఇవాళ ఎవరైతే ఓవరాక్షన్ చేశారో.. ఆ అధికారులను వదిలేది లేదు. గుర్తు పెట్టుకోండి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. పదేళ్లు మేము కూడా అధికారంలో ఉన్నాం. కానీ ఇష్టా రాజ్యంలా మేము చెయ్యలేదు. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారినోళ్లను వదలం. అడుగడుగునా అడ్డుకుంటాం. ఆ ఎమ్మెల్యేలను బయట తిరగనివ్వం” అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Also Read : ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట.. ఏకంగా మంత్రుల ముందే..