పెళ్లి కార్డు ఇచ్చి.. హైడ్రా నుంచి కాపాడాలని మల్లారెడ్డి కోరారా?

గతంలో టీడీపీలో ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారు.

పెళ్లి కార్డు ఇచ్చి.. హైడ్రా నుంచి కాపాడాలని మల్లారెడ్డి కోరారా?

Mallareddy

Updated On : October 8, 2024 / 9:43 PM IST

మాజీ మంత్రి, తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి రూటే సెపరేటు. ఆయన ఏం చేసినా వార్తే. తనకేదైనా పనిపడితే ఎంత పెద్దమనిషినైనా బుట్టలో వేసుకోవడంలో మల్లన్న దిట్ట. అయితే ఏపీ సీఎం చంద్రబాబును మల్లారెడ్డి కలవడంపై ఎన్నో లీకులు వస్తున్నాయ్. మల్లారెడ్డి మాత్రం మనవరాళి పెళ్లి పత్రిక ఇవ్వడానికే కలిశానని చెప్తున్నారు.

కానీ అసలు కథ వేరే ఉందంటున్నారు. పెళ్లి పత్రిక ఇవ్వడానికే వెళ్లినా..పనిలో పనిగా చంద్రబాబు దగ్గర ఓ అర్జీ పెట్టుకుని వచ్చారట మల్లన్న. తీగల కృష్ణారెడ్డితో పాటు మల్లారెడ్డి, అతని అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబును కలవడంతో టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ తాము టీడీపీలోకి వెళ్లడం లేదని..మనవరాళి పెళ్లి పత్రిక ఇవ్వడానికి చంద్రబాబును కలిశానని క్లారిటీ ఇచ్చారు మల్లారెడ్డి.

ఇంతవరకు బాగానే ఉన్నా..ఓ వ్యక్తిగత వ్యవహారం మీద మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలు చంద్రబాబును కలిశారన్న ప్రచారం జరుగుతోంది. హైడ్రా దాడుల నుంచి తమను ఇప్పుడు చంద్రబాబు ఒక్కరే కాపాడగలరని మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి భావిస్తున్నారట. మల్లారెడ్డి విద్యాసంస్థలతో పాటు, మర్రి రాజశేఖర్ రెడ్డికి విద్యాసంస్థలను చెరువులు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.

హైడ్రా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే?
దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలపై దృష్టి పెట్టింది. నోటీసులు కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. హైడ్రా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యాసంస్థలకు భారీ నష్టం తప్పదన్న చర్చ జరుగుతోంది.

భవనాల కూల్చివేతే కాదు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఆందోళనలో ఉన్నారట. అందుకే ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓ మాట చెప్పించాలని అనుకున్నారట. ఇంకేముందు ఎలాగూ పెళ్లి ఉంది. ఇన్విటేషన్ కార్డు ఇద్దాం..రికమండేషన్‌ లెటర్‌ పెట్టుకుందామని..చంద్రబాబును కలిశారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పెళ్లి కార్డు ఇచ్చి..తమ విద్యా సంస్థలపై జరగబోయే హైడ్రా దాడుల గురించే డిస్కస్ చేశారని తెలుస్తోంది. తమ విద్యాసంస్థలపై హైడ్రా యాక్షన్‌ లేకుండా రేవంత్ రెడ్డికి రికమండ్ చేయాలని చంద్రబాబును కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు చంద్రబాబు ఎలా స్పందించారన్నది మాత్రం సర్వత్రా ఆసక్తిరేపుతోంది.

ఆ చొరవతోనే చంద్రబాబును సాయం కోరారా?
గతంలో టీడీపీలో ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారు. చంద్రబాబు హయాంలోనే మల్లారెడ్డి కాలేజీలు స్టార్ట్‌ అయ్యాయట. ఆ చొరవతోనే చంద్రబాబు సాయం కోరారట మల్లన్న.

అయితే కాలేజీలు, కబ్జాలు అంటూ హడావుడి కాగానే. .మల్లారెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయనపై కబ్జాల ఆరోపణలు ఉండటంతో హస్తం పార్టీ చేర్చుకునేందుకు ఒప్పుకోలేదన్న టాక్ ఉంది. దాంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కూడా కలిశారు మల్లారెడ్డి. ఆయనను కలిసినప్పుడు కూడా తన ఆస్తులకు ఇబ్బంది పెట్టొద్దని కోరినట్లు తెలుస్తోంది.

కానీ బిజినెస్‌ వ్యవహారాల విషయంలో కలిసినట్లు చెప్పుకున్నారు మల్లారెడ్డి. అయితే ఈ ఆప్షన్లు అయిపోవడంతోనే ఇప్పుడు చంద్రబాబుతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే హైడ్రా దాడుల విషయంలో రేవంత్ రెడ్డికి చంద్రబాబు రికమండ్ చేస్తానన్నారా.. లేదా.. ఒకవేళ చంద్రబాబు రికమండ్‌ చేస్తే రేవంత్ రెడ్డి వింటారా అన్నది మాత్రం ముందు ముందు తేలాల్సి ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ చుట్టూ రాజకీయ రచ్చ.. ప్రైవేటీకరణ లేదంటూనే తెరవెనక ఈ వ్యవహారం ఏంటి?