వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ చుట్టూ రాజకీయ రచ్చ.. ప్రైవేటీకరణ లేదంటూనే తెరవెనక ఈ వ్యవహారం ఏంటి?

ఎవరి మాటలు నమ్మాలో తెలియక ఉక్కు కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ చుట్టూ రాజకీయ రచ్చ.. ప్రైవేటీకరణ లేదంటూనే తెరవెనక ఈ వ్యవహారం ఏంటి?

Vizag Steel Plant

Updated On : October 8, 2024 / 9:45 PM IST

పోరాటంతోనే ఆరంభం. ప్రారంభం తర్వాత సమస్యలు, సంక్షోభాలు, సమస్యలు. ఇవన్నీ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ హిస్టరీలో కామన్‌. అయితే గతమంతా ఎలా ఉన్నా మూడున్నరేళ్ల నుంచి డైలీ ఎపిసోడ్‌ అయిపోయింది విశాఖ స్టీల్ ప్లాంట్‌. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ అంటూ కేంద్రం లీకులు ఇవ్వడంతో ఉద్యమ సెగ రాజుకుంది.

మూడున్నరేళ్లుగా విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం సాగుతోంది. ధర్నాలు, రాస్తారోకోల్లో అప్పుడప్పుడు బ్రేకులు పడుతున్నా..ప్రైవేటీకరణ దిశగా ఏ అంశం తెరమీదకు వచ్చినా మళ్లీ రోడ్డుక్కెతున్నారు కార్మికులు. కొన్నాళ్లుగా అంతా సైలెంట్‌గా ఉన్న స్టీల్‌ ప్లాంట్ వివాదం ఇప్పుడు మళ్లీ రచ్చకు దారి తీస్తోంది.

రాజకీయ ఒత్తిళ్లతోనే ఉక్కును కాపాడుకోవడం సాధ్యమనే అభిప్రాయం ఉండగా.. ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఊరట కలిగించింది. ఇప్పటివరకు నిర్ణయాలు అన్నీ ఢిల్లీ స్థాయిలో తీసుకోగా క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనం జరుగుతోంది. ఈ మధ్యే కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి HD కుమారస్వామి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను సందర్శంచి.. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని ప్రకటించారు. ఆ తర్వాతే కీలక డెవలప్‌మెంట్స్ జరుగుతున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు.

డిప్యూటేషన్‌పై సాగనంపే కార్యక్రమం
స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కీలకమైన రెండు బ్లాస్ట్ ఫర్నేసులను ఇప్పటికే మూసివేశారు. ప్రస్తుతం ఒక బీఎఫ్ యూనిట్‌లో ఉత్పత్తి జరుగుతుండగా..మరోవైపు తెర వెనుక చర్యలు వేగవంతమయ్యాయి. వివిధ విభాగాల్లో కీలకమైన ఎగ్జిక్యూటివ్‌లు, టెక్నికల్ సిబ్బందిని NMDCకి డిప్యూటేషన్‌పై సాగనంపే కార్యక్రమం మొదలుపెట్టారు. ఛత్తీస్‌ఘడ్ బస్తర్ అటవీ ప్రాంతంలో నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్..నగర్నార్ స్టీల్ ప్లాంట్‌ కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్‌ను తరలించే ప్లాన్ జరుగుతోంది.

నగర్నార్ ప్లాంట్‌కు 500 మంది ఉద్యోగులను పంపించేస్తే..ఇక్కడ కీలకమైన విభాగాలు క్లోజ్‌ అయ్యే ప్రమాదం ఉందంటున్నాయి కార్మిక సంఘాలు. స్టీల్ ప్లాంట్‌లో వివిధ 30 వేల మంది కార్మికులు ఉంటే ఆ సంఖ్య ఇప్పటికే 12వేల 5వందల మందికి పడిపోయింది. సీనియర్ మేనేజర్ క్యాడర్ ఉద్యోగులు 2వదల మందికిపైగా రాజీనామా చేసి వెళ్లిపోయారు. నెలకు 20 మంది పదవీ విరమణ పొందుతున్నారు.

ఆ పోస్టులన్నీ ఖాళీగా మిగిలిపోగా..ఇప్పుడు 500 ఉద్యోగాలకు డిప్యూటేషన్ పేరుతో ఎసరు పెట్టింది. అత్యంత కీలకమైన బ్లాస్ట్ ఫర్నేస్, కోకోవన్, షిప్పింగ్, స్టోర్స్, ఆర్థిక శాఖల్లో ఎక్కువ ఉద్యోగులు కావాలని నగర్నార్ స్టీల్ ప్లాంట్ అడుగుతోంది. అంటే 15ఏళ్ల సీనియారిటీ ఉన్న సిబ్బంది అక్కడికి వెళ్లిపోతే ఆ ప్రభావం కీలక విభాగాలపై పడే అవకాశం ఉంది.

వీఆర్ఎస్ పేరుతో వదిలించుకుంటారా?
మరోవైపు ఆర్ధిక భారం తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా 4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మరో 2వేల 5వందల మంది శాశ్వత ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో వదిలించుకోవాలని చూస్తోంది. దీంతో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకే ఈ సన్నాహాలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం అవుతోంది. దీంతో మళ్లీ ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కుతున్నాయి.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, సెయిల్‌లో విలీనం చేసేలా నిర్ణయం ఉంటుందని కూటమి నేతలు చెబుతుండగా, వైసీపీ, కార్మిక సంఘాలు మాత్రం ఈ మాటలను లెక్క చేయడం లేదు. బ్లాస్ ఫర్నేస్‌ల మూత, కార్మికుల తొలగింపు, ఉద్యోగుల డిప్యూటేషన్ వంటి పరిణామాలన్నీ ప్రైవేటీకరణకు దారిస్తాయని అంటున్నాయి. అయితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎట్టి పరిస్థితిల్లో అలా జరగనివ్వమని, తర్వలోనే సెయిల్‌లో విలీనం చేసే ప్రకటన రాబోతుందని హామీ ఇస్తున్నారు.

దీంతో ఎవరి మాటలు నమ్మాలో తెలియక ఉక్కు కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు..పరిశ్రమల శాఖమంత్రి కుమారస్వామిని కలిశారు. త్వరలోనే స్టీల్ ప్లాంట్‌ను గట్టెక్కేందుకు సెయిల్ విలీనం లేదా మైన్స్ కేటాయింపు లేదా ఇంకేదైనా కొత్త వార్త వస్తుందని కార్మిక సంఘాలు ఎదురుచూస్తున్నాయి. ఏది తెల్వకపోయినా మరల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశం లేకపోలేదు.

KTR: కొండా సురేఖ కామెంట్స్‌పై కేటీఆర్ మౌనం అందుకేనా?