MLC Kavitha : హిందూ వ్యతిరేక ధోరణి కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది : ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉంది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు.

MLC Kavitha : హిందూ వ్యతిరేక ధోరణి కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది : ఎమ్మెల్సీ కవిత

BRS MLC K Kavitha : కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించ లేదు..? డీఎంకే నేతలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎందుకు అదుపు చేయడం లేదని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ వైఖరిని వెల్లడించాలన్నారు.

కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అంటూ విమర్శించారు. తెలంగాణలో హామీల అమలుకు మరికొంత సమయం ఇస్తామన్నారు. తగిన సమయంలోగా హామీలు అమలు చేయకపోతే కచ్చితంగా పోరాటం చేస్తామని అన్నారు. హామీలు ఇచ్చి మర్చిపోవటం కాంగ్రెస్ కు అలవాటేనని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఆరు హామీలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేశారు. కానీ వాటిని ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు.

రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరు?
హిందీ మాట్లాడేవారు తమ రాష్ట్రాల్లో టాయిలెట్లు కడుగుతున్నారని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కొన్ని వర్గాల ప్రజల ఓట్ల కోసం నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, అది చివరికి మనం ఊహించలేని విధంగా దేశాన్ని చీల్చుతుందని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర, దేశాన్ని ఏకం చేయడం గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఎందుకు దీనిపై మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సనాతన ధర్మ వివాదంపై రాహుల్ గాంధీ స్పందించి ఉంటే ఇలాంటి ప్రకటనలు ఇతరులు చేసి ఉండేవారు కాదన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మిత్రపక్షాలను అదుపుచేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. హిందువులు, హిందీ మాట్లాడే రాష్ట్రాలకు వ్యతిరేకం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉందన్నారు.