MLC Kavitha: పార్టీతో, ఫ్యామిలీతో కవిత బంధం తెగినట్లేనా? ఎందుకంటే?

ఇలా వరుస పరిణామాలతో.. ఓవైపు కుటుంబానికి, పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. అదే సమయంలో ఫ్యామిలీకి, పార్టీకి కౌంటర్‌గా కార్యక్రమాలు చేపడుతున్నారు

MLC Kavitha: పార్టీతో, ఫ్యామిలీతో కవిత బంధం తెగినట్లేనా? ఎందుకంటే?

Updated On : August 11, 2025 / 9:21 PM IST

సరిగ్గా గమనిస్తే.. జీవితంలో సమస్యలెప్పుడూ డబుల్‌గానే వస్తాయ్‌. ఎటు వైపు ఉంటామన్న దాని మీదే.. ఆ రెండింటి పరిష్కారం ఆధారపడి ఉంటుంది. ఐతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో మాత్రం కాస్త డిఫరెంట్‌ ! పార్టీకి, ఫ్యామిలీకి.. కవిత సమస్యగా మారిపోయారు. ఫ్యామిలీ దూరం పెడుతోంది.. పార్టీ పట్టించుకోవడం మానేసింది.. ఐనా సరే కవిత మాత్రం తగ్గేదే లే అంటున్నారు. ఢీ అంటే ఢీ అంటూ దూసుకుపోతున్నారు. దీంతో రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.. అసలు కవిత ఏం చేస్తున్నారు.. పార్టీతో, ఫ్యామిలీతో ఆమె బంధం తెగిపోయినట్లేనా..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యవహారం.. గులాబీ పార్టీలోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రస్టింగ్‌గా మారింది. తండ్రి కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ లీక్ అవడం నుంచి.. ఇప్పటివరకు ప్రత్యేక ఎజెండాతో కవిత ముందుకు వెళ్తున్నారు. సొంత కుటుంబం, బీఆర్ఎస్ టార్గెట్‌గా రాజకీయం చేస్తున్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టిన కవిత.. సోదరుడు కేటీఆర్ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: క్షణక్షణం ఉత్కంఠ.. పులివెందుల ఎపిసోడ్‌లో ట్విస్టులు‌.. ఏం జరగబోతోంది?

కేసీఆర్ ఫ్యామిలీతో, బీఆర్ఎస్ పార్టీతో ఏ మాత్రం సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి ద్వారా వరుసగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో రోజురోజుకు కవిత వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఓ వైపు కుటుంబం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనే ధోరణితో ముందుకు వెళ్లడం వెనక వ్యూహం ఏంటా అనే చర్చ జరుగుతోంది.

తాను రాసిన లేఖ లీక్ అయిన తర్వాత కొన్నాళ్లకు.. కేసీఆర్‌కు దగ్గరయ్యేందుకు కవిత ప్రయత్నాలు చేశారు. కాళేశ్వం కమిషన్ విచారణకు వెళ్లిన సందర్భంలో.. కేసీఆర్‌ను కలిసేందుకు కవిత ప్రయత్నించగా.. ఆయన పెద్దగా పట్టించుకోలేదనే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత కేసీఆర్‌ ఆసుపత్రిలో ఉన్న టైమ్‌లోనూ.. చూసేందుకు, కలిసేందుకు రెండు మూడుసార్లు వెళ్లినా.. అప్పుడు కూడా కవితతో మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదని తెలుస్తోంది. ఇలాంటి టైమ్‌లో రాఖీ పండగ వచ్చింది.

సోదరుడు కేటీఆర్‌కు దగ్గరయ్యేందుకు.. కవిత ప్రయత్నించారన్న టాక్ వినిపించింది. రాఖీ పండగకు కొద్దిరోజుల ముందే.. తాను కేటీఆర్‌కు రాఖీ కడతానని కవిత పలు సందర్భాల్లో చెప్పారు. ఆమె మాటలు రాజకీయవర్గాలను అవాక్కయ్యేలా చేశాయ్‌. తాను కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప.. మరొకరి లీడర్‌షిప్‌ను ఒప్పుకోనని పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన కవిత.. హఠాత్తుగా రాఖీ కడతాను అనడం ఏంటనే చర్చ జరిగింది. ఐతే కవిత చేతితో రాఖీ కట్టించుకోవడం ఇష్టం లేదో.. నిజంగానే పార్టీ వ్యవహారాలపై వెళ్లారో కానీ.. పండగ రోజు కేటీఆర్‌ హైదరాబాద్‌లో అందుబాటులో లేకుండా పోయారు.

ఆసక్తి రేపుతోన్న మరో ప్రచారం
ఇప్పుడు రాజకీయవర్గాల్లో జరుగుతున్న మరో ప్రచారం ఆసక్తి రేపుతోంది. కేటీఆర్ అందుబాటులో లేరని తెలిసి కూడా.. తాను రాఖీ కట్టేందుకు వస్తున్నానని ఆయనకు కవిత మెసేజ్ పెట్టారట. ఐతే తాను అందుబాటులో లేనని కేటీఆర్‌ రిప్లై ఇచ్చినట్లు టాక్‌. దీంతో దీన్ని కవిత ఆయుధంగా వాడుకున్నారా అనే గాసిప్స్ మొదలయ్యాయ్‌. కవిత రాఖీ కడతానని చెప్పినా.. కావాలనే కేటీఆర్ హైదరాబాద్‌లో అందుబాటులో లేకుండా పోయారనే టాక్ మొదలైంది.

ఇలా ఓవరాల్‌గా రాఖీ పండగను కూడా.. కవిత తన రాజకీయం కోసం వాడేశారనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక అటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో.. తన కార్యక్రమాలను కవిత సైలెంట్‌గా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ మధ్య బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించి.. సంబరాలు చేసుకున్న కవిత.. ఆ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఇప్పుడు బొగ్గు గని ప్రాంత రాజకీయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ అనుబంధ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి.. గతంలో కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఐతే ఆ తర్వాత ఆమెను తొలగించి.. ఆ స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను గులాబీ పార్టీ నియమించింది. దీంతో బీఆర్ఎస్‌ మీద ప్రతీకారం తీర్చుకునే పనిలో కవిత పడినట్లు కనిపిస్తున్నారు. గులాబీ పార్టీకి కౌంటర్‌గా.. HMS కార్మిక సంస్థతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా కార్మికులకు భరోసా కల్పించేందుకు.. దసరా తర్వాత సింగరేణి యాత్ర చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. రాబోయే సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో.. నేరుగా బీఆర్ఎస్‌తోనే పోటీ పడేందుకు కవిత సిద్ధంగా ఉన్నారనే టాక్‌ నడుస్తోంది.

ఇలా వరుస పరిణామాలతో.. ఓవైపు కుటుంబానికి, పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. అదే సమయంలో ఫ్యామిలీకి, పార్టీకి కౌంటర్‌గా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో అసలు కవిత ఆంతర్యమేంటి.. ఆమె నిర్ణయాలు వెనక వ్యూహం ఏంటనేది కన్ఫ్యూజింగ్‌గా మారింది. ప్రతీ విషయంలో గులాబీ పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్న కవిత.. రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారనే ఆసక్తి కనిపిస్తోంది. ఓవరాల్‌గా రాజకీయంగా కవిత వేస్తున్న అడుగులు.. అటు ఫ్యామిలీకి, ఇటు పార్టీకి ఆమెను దూరం చేస్తున్నాయన్నది మరికొందరి మాట. కుటుంబంతో, పార్టీతో బంధం తెగిపోయినట్లేనా అనే చర్చ జరుగుతోంది.