పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ త్రిముఖ వ్యూహం
బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఈ ఇద్దరిపై మాత్రం కచ్చితంగా వేటు పడుతుందన్న చర్చ జరుగుతోంది.

BRS: ఫిరాయింపుల ఎమ్మెల్యేల ఎపిసోడ్ క్లైమాక్స్‌లో కాక రేపుతోంది. ఓవైపు స్పీకర్ నోటీసులు..విచారణ..మరోవైపు సుప్రీంకోర్టు పెట్టిన డెడ్‌లైన్ దగ్గర పడుతున్న టైమ్‌లో బీఆర్ఎస్ సరికొత్త ప్లాన్ చేస్తోందట. జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారంలో కారు గేరు మారుస్తోందట. ఇప్పటికే సుప్రీంకోర్టులో తమ వాదన వినిపించిన బీఆర్ఎస్, ఇప్పుడు స్పీకర్ దగ్గర అనర్హత వేటు కోసం పట్టుబడుతోంది. అయితే అటు ప్రజాక్షేత్రంలోనూ జంపింగ్ ఎమ్మెల్యేల తీరును ఎండగట్టే ప్లాన్ చేస్తోందట కారు పార్టీ.
పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు పెట్టి సమరానికి సై అనడం ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలోనే ముందుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల గడ్డ నుంచి గర్జన స్టార్ట్ చేసింది. గద్వాల గర్జన సభకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణమోహన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెబుతున్న కృష్ణమోహన్ రెడ్డి..బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరుగుతుంటే ఎక్కడున్నాడని ప్రశ్నించారు.
Also Read: తోపుదుర్తి వర్సెస్ కేతిరెడ్డి.. ధర్మవరంలో రాప్తాడు రాజకీయం.. ఇందుకేనా.?
ఇలా గద్వాల్‌తో పాటు పార్టీ మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా సభలు, సమావేశాలు పెట్టబోతోందట బీఆర్ఎస్. అక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేల బండారం స్థానిక జనంలోనే చర్చకు పెట్టి..మరోవైపు క్యాడర్లో జోష్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సారి ఉప ఎన్నికలు వచ్చినా రాకపోయినా.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ పది మందిని ఎండగట్టేలా ప్లాన్‌చేస్తోంది గులాబీదళం.
కారు గుర్తుపై గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తోంది గులాబీ పార్టీ. దమ్ముంటే ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలవాలని ఛాలెంజ్ చేస్తున్నారు గులాబీ లీడర్లు. స్పీకర్ నిర్ణయం తీసుకునేలోపే జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సభలు పెట్టి ఓ మూమెంటమ్ క్రియేట్ చేయాలని భావిస్తోందట. ఆ తర్వాత స్పీకర్ డెసిషన్‌ను బట్టి మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉందట కారు పార్టీ.
ఈ ఇద్దరిపై మాత్రం కచ్చితంగా వేటు?
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు కౌంటర్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ఘన్పూర్ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం ఇంకా సమాధానం ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతోంది. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ ఇద్దరిపై మాత్రం కచ్చితంగా వేటు పడుతుందన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వెర్షన్ కూడా వింటున్నారు స్పీకర్.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్కు ఇచ్చిన వివరణపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు అన్ని ఆధారాలు, సాక్ష్యాలను మరోసారి స్పీకర్‌కు అందిస్తుంది బీఆర్ఎస్. పది మందిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతోంది. ఓవైపు నియోజకవర్గాల్లో సభలు..మరోవైపు న్యాయపోరాటంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో ఏదో ఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట గులాబీ లీడర్లు. ఈ ఇష్యూకు ఎప్పుడు ఎండ్‌కార్డ్ పడుతుందో చూడాలి మరి.