మళ్లీ టీఆర్ఎస్‎గా బీఆర్ఎస్.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు కేసీఆర్ నిర్ణయం?

ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించే అవకాశం ఉండడంతో... ఆరోజు నాటికి పార్టీ పేరు మార్పుపై అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం గులాబీ నేతల్లోనే జరుగుతోంది.

మళ్లీ టీఆర్ఎస్‎గా బీఆర్ఎస్.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు కేసీఆర్ నిర్ణయం?

BRS to TRS: తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్ ఏప్రిల్ 27, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. రాష్ట్రసాధన కోసం గులాబీ పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజలకు చేరువైంది. దాదాపు 12 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ తన కనుసన్నల్లో నడిపించారు. ఉద్యమనికి జాతీయస్థాయిలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా వ్యవహరించి విజయవంతం అయ్యారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా రాజకీయాలను శాసించే స్థాయిలో నిలిచింది. 2014, 2018 ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టింది. ఉద్యమనేతగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వ అధినేతగా.. పాలనలో తన మార్క్ వేసుకున్నారు. 2024 ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న లక్ష్యంగా 2021 నుంచి జాతీయ రాజకీయాల్లో తన మార్క్ వేసుకోవాలని వివిధ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ నేతలను సిద్ధం చేశారు. మహారాష్ట్ర, ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో భారీ మద్దతు దక్కడంతో.. తన ప్రణాళికను జాతీయ రాజకీయాల్లో అమలు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు గులాబీ బాస్. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరును 5 అక్టోబర్ 2022వ సంవత్సరంలో భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ పేరు మార్పు తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో బీఆర్ఎస్‌ తొలివిజయంగా నమోదు చేసుకుంది. మరో ఏడాది లోపలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఊహించని విధంగా ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. ఈ ప్రభావంతో పొరుగు రాష్ట్రాల్లో విస్తరణపై కేసీఆర్ ప్రస్తుతం ఆసక్తి చూపడం లేదు. ఇటీవల జరిగిన కరీంనగర్ సభలో కూడా కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కానీ పార్టీ నేతలు మాత్రం తమకి బీఆర్ఎస్ పేరు కలిసి రాలేదని.. పార్టీ పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. పార్టీ పేరు మార్పు వ్యవహారం న్యాయపరంగా అధిగమించే అంశాలను పార్టీ పరిశీలిస్తున్న చర్చ జరుగుతుంది.

Also Read: తీవ్ర విమర్శలు చేసుకుంటున్న రేవంత్, కేసీఆర్.. ఆ హుందాతనమే కరువైందా?

ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించే అవకాశం ఉండడంతో… ఆరోజు నాటికి పార్టీ పేరు మార్పుపై అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం గులాబీ నేతల్లోనే జరుగుతోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ పేరు మార్పుపై తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేశారు.

Also Read: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్‌ నేతలు.. వరుసగా ఏం జరిగిందో తెలుసా?

తెలంగాణ రాష్ట్ర సమితిగా కలిసి వచ్చిన పేరును మళ్లీ గులాబీ పార్టీ మార్చుకున్నట్లయితే రాబోయే రోజుల్లో పార్టీకి లబ్ధి చేకూరుస్తుందన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పేరే ఇబ్బందికరంగా ఉన్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు కూడా వచ్చేవి కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై నేతల్లో ఆసక్తిగా ఉంది.