BRS Walkout: సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్.. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చించేసి.. నినాదాలు..
చర్చకు మరింత సమయం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు.

BRS Walkout: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెత్త నివేదిక అని, న్యాయస్థానంలో ఆ నివేదిక నిలబడదని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు.
ఈ క్రమంలో ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను బీఆర్ఎస్ సభ్యులు చించేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభ్యులు నినాదాలు చేశారు. చర్చకు మరింత సమయం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. అయినా మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడంతో సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.
సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అడ్డంగా మహిళా మార్షల్స్ ను పెట్టడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని నడుపుతారా అంటూ ఫైర్ అయ్యారు.