పెన్షన్ పథకానికి రైతులను చేర్చండి…తెలంగాణని కోరిన కేంద్రం

కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ లబ్ధిదారులను నిర్థారించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రప్రభుత్వం కోరింది. 60ఏళ్లు దాటిన చిన్న, సన్నకారు రైతులకు 3వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ అందించే పీఎం కిసాన్ మాన్ ధన్ యోజనకి రైతులను చేర్చాలని కోరింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ లబ్దిదారులకు విషయాన్ని తెలియజేసి,వారి నుంచి ఒప్పంద లేఖలు తీసుకోవాలని కేంద్రం తమకు తెలియజేసిందని, తద్వారా డబ్బు లబ్దిదారుల బ్యాంకు ఖాతాల నుండి డెబిట్ అవుతుందని ఓ అధికారి తెలిపారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కి 36లక్షల మంది రైతులు లబ్దిదారులని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. 31.7లక్షల మంది రైతుల అకౌంట్లలోకి కు ప్రస్థుత ఆర్థిక సంవత్సరంలోని జులై వరకు 640కోట్లను కేంద్రం ట్రాన్స్ ఫర్ చేసింది. మిగతా 4లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు తర్వాత పడతాయి.
కేంద్రప్రభుత్వం లబ్దిదారులైన ఒక్కో రైతు అకౌంట్ లో ఈ స్కీమ్ కింద వేసే మొత్తం 6వేల రూపాయల్లో పెన్షన్ స్కీమ్ కి ప్రీమియం కింద ఒక్కో రైతు 2వేల 400రూపాయలు కట్టవలసి ఉంటుందని కేంద్రం తెలిపింది. దీంతో రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి లబ్దిగా 3వేల 600 రూపాయలు మాత్రమే పొందుతారని ఓ అధికారి తెలిపారు.