Diwali Crackers: టపాసులు కాల్చే సమయంలో పిల్లలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.. తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
బాణసంచా కాల్చడం వల్ల కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పరిమితి సంఖ్యలో టపాసులు కాల్చాలి. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి.

Diwali Crackers
Diwali Crackers: దీపావళి అంటే ముందుగా గుర్తుకొచ్చేది టపాసుల మోత. పల్లె నుంచి పట్టణం వరకు చిన్నా, పెద్దా అనేతేడాలేకుండా ప్రతీఒక్కరూ దీపావళికి టపాసుల మోతమోగిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లలు బాణసంచా కాల్చే సమయంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా వారి దగ్గర ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు, వారికి రక్షణ కవచాలు ధరింపజేయాలి. లేకుంటే టపాసులు కాల్చే సమయంలో నిప్పురవ్వలు మీదపడి పలు ప్రమాదాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
→ బాణసంచా కాల్చడంతో కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పరిమితి సంఖ్యలో టపాసులు కాల్చాలి.
→ ఎట్టిపరిస్థితుల్లో చేతిలో పట్టుకొని టపాకాయలను వెలిగించొద్దు.
→ వాటిపై వంగి టపాకాయలను వెలిగించొద్దు.. వెలగని టపాకాయల దగ్గరకు వెంటనే వెళ్లకుండా కొంతసేపు ఆగి వెళ్లాలి.
→ సీసా, రేకు డబ్బా, బోర్లించిన కుండవంటి పాత్రల్లో పెట్టి టపాకాయలను వెలిగించవద్దు. అలా చేస్తే ప్రమాదం భారినపడేఅవకాశం ఎక్కువ.
→ క్రాకర్స్ కాల్చే సమయంలో సింథటిక్, వదులుగా ఉన్న దుస్తులు కాకుండా మందంగా ఉన్న నూలు దుస్తులను మాత్రమే ధరించండి.
→ భారీగా గాలులు వీచే సందర్భంలో బాణసంచా కాల్చవద్దు. అలాచేయడం వల్ల గాలికి నిప్పురవ్వలు మీ మీదపడటం లేదా పక్కవారిమీద పడటం జరిగి గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ.
→బాణసంచా కాల్చే సమయంలో పిల్లల్ని ఒంటిరిగా వదలొద్దు. తల్లిదండ్రులు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి.
→ బాణసంచా కాల్చే సమయంలో కంటికి రక్షణగా కళ్లద్దాలను ధరించాలి. టపాసులు కాల్చేసమయంలో ముఖాన్ని వాటికి దగ్గరగా ఉంచొద్దు.
→ అనుకోని పరిస్థితుల్లో బాణసంచా పేల్చే సమయంలో గాయపడితే కాలినచోట క్రీమ్, ఆయింట్ మెంట్ , నూనె పూయకండి.. వెంటనే వైద్య సహాయం తీసుకొనేలా చర్యలు తీసుకోండి.
→ దగ్గరలో నీటిని అందుబాటులో ఉంచుకొని టపాసులు పేల్చాలి. ఒకవేళ చర్మంపై నిప్పురవ్వలు పడి కాలినట్లయితే, కాలినచోట ఎక్కువ నీరు పోయాలి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. సొంత వైద్యం వద్దు.
→ ఒకవేళ తీవ్రమైన కాలిన గాయాలైతే.. మంట ఆర్పిన తరువాత, ఆ వ్యక్తిని ఒక శుభ్రమైన దుప్పటిలో చుట్టి వెంటనే ఆసుపత్రికి తరలించాలి.