నేడు మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష..వ్యాక్సినేషన్‌, సంక్షేమ కార్యక్రమాలు, భూముల రిజిస్ట్రేషన్‌పై చర్చ

నేడు మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష..వ్యాక్సినేషన్‌, సంక్షేమ కార్యక్రమాలు, భూముల రిజిస్ట్రేషన్‌పై చర్చ

Updated On : January 11, 2021 / 8:48 AM IST

CM KCR review with ministers and district collectors : తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు భూముల రిజిస్ట్రేషన్‌పై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. నేడు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతభవన్ లో సమావేశం కానున్నారు. రెవెన్యూ, పంచాయతిరాజ్, మున్సిపల్, వైద్య శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకొనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు.

ఇప్పటికే రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ప్రగతిభవన్ లో సీనియర్ అధికారులు, కొంత మంది కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో రెవెన్యూ శాఖకు సంబంధించి పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు ప్రస్తావనకు రాగా.. తాజాగా జరిగే సమావేశంలో వాటిపై చర్చించే అవకాశం ఉంది. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనల్ల ఏర్పాటు, పార్ట్.బిలో చేర్చిన అంశాల పరిష్కారం తదితర విషయాలపై సమాశంలో చర్చించే అవకాశం ఉంది.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నారు. 16వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనుండటంతో వ్యాక్సినేషన్‌పై చర్చించే అవకాశం ఉంది. వ్యాక్సిన్ అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ను పౌరులకు వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందించనున్నారు. అదే విధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు తీరుతెన్నులపై సమీక్షించనున్నారు.

గ్రామాలకు, పట్టణాలకు నిధులు సకాలంలో అందుతున్నాయా? వాటి వినియోగం ఎలా ఉంది? తదితర అంశాలపై చర్చంచే అవకాశం ఉంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పరోగతిపై సమీక్షించనున్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అమలును సమావేశంలో సమీక్షించనున్నారు.

కరోనా నేపథ్యంలో మూతపడిన స్కూళ్లు ఇంకా తెరుచుకోకపోవడంతో వాటిని ఎప్పటి నుంచి తెరవాలనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూలంకషంగా చర్చించనున్నారు.