రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ దూకుడు..

రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.

Farm Loan Waiver : రైతు రుణమాఫీపై తెలంగాణ సర్కార్ దూకుడు పెంచింది. ఈ నెల 18లోపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 18వ తేదీ సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలకు హాజరుకానున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

కలెక్టర్ల సమావేశంలో రుణమాఫీకి ముహూర్తం ఖరారు చేసేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్లుండి(జూలై 18) సాయంత్రం వరకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. లక్ష రూపాయల వరకు రుణాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. పంద్రాగస్టులోపు ప్రతి రైతుకు 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2లక్షల రుణమాఫీలో ముందుగా తొలి విడతగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనుంది సర్కార్. ఈ నెల 18వ తేదీ సాయంత్రం లోపు రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు చేరనున్నాయి.

ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటకు అనుగుణంగా మొదటి స్టెప్ లో లక్ష రూపాయల రుణమాఫీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.

రేపు(జూలై 17) ప్రజాభవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు హాజరుకానున్నారు. రుణమాఫీ ప్రధాన ఎజెండాగా సమావేశం జరగనుంది. ఈ నెల 18 నుంచి రుణమాఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read : రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

ట్రెండింగ్ వార్తలు