గత ప్రభుత్వంలోలా రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా ఏంటి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తాము ఇచ్చే రైతు భరోసాపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారు. రైతులను ఆదుకునే విషయంలో కాంగ్రెస్ సర్కారు ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు రైతుబంధు తెచ్చారని, అయితే, గత ప్రభుత్వం రైతు బంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. సాగులోలేని భూములకు రైతు బంధు ఇచ్చిందని చెప్పారు. రూ.22,600 కోట్ల కోట్ల రైతు బంధు ద్వారా ఆయాచిత లబ్ధి చేశారని అన్నారు. రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తలకూ రైతు బంధు ఇచ్చారని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకుని కొందరు లబ్ధిపొందారని రేవంత్ రెడ్డి తెలిపారు. కీలకమైన రైతు బంధుపై చర్చ జరిగితే ప్రతిపక్ష నేత సలహాలు ఇస్తారని అనుకున్నానని అన్నారు. బీఆర్ఎస్‌కు ప్రతీదీ వ్యాపారమేనని అన్నారు. రైతుల బలవన్మరణాలపై బీఆర్ఎస్ నేతలు అసత్యాలు చెబుతున్నారని తెలిపారు. రైతులకు బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలని అన్నారు.