Cm Revanth Reddy : వారి ఉచ్చులో పడొద్దు, కులగణనపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి- తీన్మార్ మల్లన్నపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
మేము చేసిన సర్వేని కొందరు తప్పుపడుతున్నారు. ఎక్కడ తప్పు ఉందో చెప్పండి.

Cm Revanth Reddy : కులగణన సర్వేపై పార్టీ బీసీ నేతలకు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మనం చేసిన లెక్క ముమ్మాటికీ పక్కా అని ఆయన అన్నారు. కులగణన పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి గట్టిగా సమాధానం చెప్పండని పిలుపునిచ్చారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ కులసర్వేలో పాల్గొన లేదన్నారు. ఫామ్ హౌస్ లో పడుకున్న వ్యక్తి బీసీలకు మంచివాడా..? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కులగణనలో పాల్గొనని వారి ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టండని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
”మార్చి 10 లోపు కులాల వారీగా సంఘం మీటింగ్ లు పెట్టుకోండి. బీసీ కులగణన బలహీన వర్గాల భావోద్వేగం. దీన్ని ముందుకు తీసుకెళ్ళడమే మన లక్ష్యం కావాలి. సర్వేపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ వివరించండి. ప్రతిపక్షాల నెగిటివ్ ప్రచారాన్ని సెమినార్లు పెట్టి ఎండగట్టండి. జనగణన, కులగణన జరగాలని డిమాండ్ చేస్తున్నాం.
Also Read : యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..? దేశంలో మొదటిది..
బీసీ రిజర్వేషన్ల కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ బీసీ నేతలదే. బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఎక్కడ తప్పు జరిగిందో చూపించాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేస్తున్నా. పార్టీ నేతలు బీసీ కులగణనపై అవగాహన చేసుకోవాలి.
ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు. బీసీలు.. మీరు మౌనంగా ఉంటే మీకే నష్టం. బీసీలు నిలదీస్తే.. తమ పదవులు పోతాయని బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారు. బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని బీసీ కులగణన చేశాం.
కేసీఆర్ ఒక్కరోజులో సర్వే చేసి కాకి లెక్కలు చెప్పారు. ఆ వివరాలు బయటకు చెప్పకుండా దాచి పెట్టుకున్నారు. రాజకీయాలకు ఆ వివరాలను కేసీఆర్ వినియోగించుకున్నారు. కానీ మేము అలా చేయలేదు. ప్లానింగ్ విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని సర్వే చేశాం. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే తప్పుడు సర్వే. ఎస్సీల్లో 56 కులాలు ఉంటే 86 కులాలుగా సమగ్ర కుటుంబ సర్వేలో చూపించారు.
మేము చేసిన సర్వేని కొందరు తప్పుపడుతున్నారు. ఎక్కడ తప్పు ఉందో చెప్పండి. బీఆర్ఎస్, బీజేపీ కోర్టుల్లో కేసులు వేసి కులగణన ప్రక్రియను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంటుంది. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే చేశాం. మోదీ బీసీ అని చెప్పుకుంటారు. 2011లో కాంగ్రెస్ చేసిన బీసీ సర్వే లెక్కలు బయట పెట్టాలి.
Also Read : కుమార్తె కాళ్లు కడిగి కన్యాదానం చేసిన తండ్రి.. ఆ తరువాత గుండె పోటుతో..
బండి సంజయ్ కు ప్రేమ ఉంటే ఆ లెక్కలు బయట పెట్టండి. బీసీలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని బయట పెట్టడం లేదు. ప్రతీ రాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తే దేశం మొత్తం చేయాల్సి వస్తుంది. బీసీల లెక్క తేలితే బీజేపీలో అధికారం చెలాయించే ఒకటి రెండు సామాజిక వర్గాలకు ఇబ్బంది అవుతుంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఇప్పటివరకు వారి వివరాలు నమోదు చేసుకోలేదు.
50శాతం ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్ల భయం. అందుకే బీసీల సర్వేకు వారు సహకరించడం లేదు. కేసీఆర్ నాలుగు కేటగిరీల్లో లెక్కలు తీస్తే మేము ఐదు కేటగిరీల్లో వివరాలు తీశాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.