తన కారుకి స్వయంగా పోస్టర్ అతికించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

CM Revanth reddy pasted Bharat Jodo Nyay Yatra poster on his car
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల సందర్భంగా తమ పార్టీ తరపున ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తాను వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తన కోసం ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని అధికారులకు ఆయన ఆదేశాల్సిన సంగతి తెలిసిందే.
తాజాగా తన కారుకు స్వయంగా పోస్టర్ అతికించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ జనవరి 14న మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జోడో న్యాయ్ యాత్ర పోస్టర్ ను స్వయంగా తన కారుకు అతికించుకున్నారు రేవంత్. భారత ప్రజల హక్కులను, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ యాత్రను విజయవంతం చేయాలని దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
?? భారత ప్రజల హక్కులను, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఏఐసిసి నాయకులు శ్రీ రాహూల్ గాంధీ గారు జనవరి 14న మణిపూర్ నుండి చేపట్టనున్న “భారత్ జోడో న్యాయ్ యాత్ర”కు మద్దతుగా తన వాహనానికి పోస్టర్ ను అతికిస్తున్న ముఖ్యమంత్రి & టిపిసిసి అధ్యక్షులు శ్రీ @revanth_anumula గారు.… pic.twitter.com/ccLN2bOJB9
— Telangana Congress (@INCTelangana) January 10, 2024
మణిపూర్‌కు మద్దతుగా భారత్ జోడో న్యాయ్ యాత్ర
మణిపూర్ ఎనిమిది నెలలకు పైగా మంటల్లో కాలిపోతుందని, బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్.. శాంతిని నెలకొల్పడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజలను రక్షించడంలో, ప్రశాంతతను నెలకొల్పడంలో మోదీ సర్కారు విఫలమైందని విమర్శించింది. మణిపూర్ అల్లర్లలో 60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారని, 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. మహిళలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ మణిపూర్‌లో ఎప్పుడు పర్యటిస్తారని ప్రశ్నించింది. మణిపూర్‌కు మద్దతుగా రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టారని తెలిపింది.