తెలంగాణ రాష్ట్ర గీతానికి రాజకీయ పక్షాలు, ఉద్యమకారుల ఆమోదం

రాష్ట్ర గేయం, చిహ్నం విషయంలో అభిప్రాయాలు తీసుకోవడంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర గీతానికి రాజకీయ పక్షాలు, ఉద్యమకారుల ఆమోదం

Updated On : May 31, 2024 / 12:20 AM IST

Telangana State Anthem : తెలంగాణ రాష్ట్ర గీతంపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశం నిర్వహించారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రొ.కోదండరామ్, కవి అందెశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా హాజరయ్యారు. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇతర ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 2 రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్. దీనికి సంబంధించి కసరత్తు పూర్తి చేస్తున్నారు. 13 చరణాలతో కూడిన పాటను సిద్ధం చేశారు. కొన్ని మార్పులు చేర్పులు చేశారు.

కాగా.. తెలంగాణ లోగోను ఇంకా ఫైనల్ చేయలేదని సీఎం రేవంత్ తెలిపారు. అధికారిక చిహ్నంపై కేబినెట్, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అందరి అభిప్రాయాల తర్వాతనే నిర్ణయం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు. రాష్ట్ర గేయం, చిహ్నం విషయంలో అభిప్రాయాలు తీసుకోవడంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

ఇక జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతానికి రాజకీయపక్షాలు, ఉద్యమకారులు ఆమోదం తెలిపారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సమావేశంలో ప్రతిపాదించారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. జయ జయ తెలంగాణ గీతాన్ని పాడి వినిపించారు కీరవాణి, సింగర్ రేవంత్ బృందం. రాష్ట్ర గీతంపై సిపిఐ, సిపిఎం, తెలంగాణ జన సమితి, కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, జేఏసీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. రాష్ట్ర గీతంలో మగ్దుం మొహియుద్దీన్, షేక్ బందగి, కొమరం భీమ్ లాంటి తెలంగాణ సాయుధ పోరాట యోధుల పేర్లు చేర్చాలని సిపిఐ సూచించింది.

Also Read : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల వేళ ముదురుతున్న వివాదం