Cm Revanth Reddy
ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రభుత్వానికి, పట్టభద్రులకు మధ్య వారధిగా ఉంటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని బలహీన పర్చే కుట్రలు చేస్తున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ను ప్రజలు తిరస్కరిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నారని చురకలంటించారు.
కాంగ్రెస్ ను గెలిపించవద్దని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలబడని బీఆర్‌ఎస్ రాజకీయ పార్టీనేకాదని అన్నారు. పోటీకి నిలబడని వారు కాంగ్రెస్ ను ఎలా ప్రశ్నిస్తారని అన్నారు. తాము 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
Also Read: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి.. ఇలా చెక్ చేసుకోండి..
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, నిజామాబాద్ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్ వన్ పోస్టు ఇచ్చామని అన్నారు. వరంగల్ కు చెందిన దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చామని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యోగులను ముప్పుతిప్పలు పెట్టారని తెలిపారు. పదేళ్ల పాటు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పారని అన్నారు.
తాను చెప్పింది నిజమైతేనే తమకు ఓటు వేయండని కోరారు. నిజామాబాద్ రైతులు పంజాబ్ రైతులతో పోటీపడి పంటలు పండిస్తారని అన్నారు. రైతు రుణమాఫీ చేశాం, రైతు భరోసా ఇచ్చామని చెప్పారు. కేసీఆర్ సర్కారు చేసిన అప్పుకు ఇంతవరకు 75 వేల కోట్ల రూపాయల వడ్డీ కట్టామని అన్నారు. తాను సీఎం అయ్యాక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీన జీతం ఇస్తున్నామని చెప్పారు.