CM Revanth Reddy : ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్.. స్కూల్ ప్రత్యేకతలివే..
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్ ను ఆవిష్కరించారు.
CM Revanth Reddy Unveils Telangana Public School Pylon at Aarutla
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్‌ను ప్రారంభించారు. అనంతరం స్కూల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన డిజిటల్ క్లాస్ రూమ్‌లు, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్‌లు, క్రీడా మైదానాలను పరిశీలించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు సంబంధించిన వివరాలను మ్యాప్‌ను చూపుతూ సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఇంటర్నేషనల్ స్కూల్ తరహాలో..
ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను నిర్మాణం చేసింది. ఈ స్కూల్ లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్ లో విద్య అందుతుంది. స్కూల్ లో హైటెక్ వసతులు కల్పించారు. గాలి, వెలుతురు వచ్చే విశాలమైన గదులు, డిజిటల్ బోర్డులు, అత్యాధునిక ల్యాబ్స్, జిమ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. కబడ్డీ, టెన్నిస్, వాలీబాల్, క్రికెట్, ఫుట్ బాల్ వంటి క్రీడలకు ప్రత్యేక కోచ్ లను నియమించారు. అంతేకాదు.. విద్యార్థుల కోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. ఇంటి నుంచి స్కూల్ కు రావడానికి ఐదు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ స్కూల్లో 1,814 మంది విద్యార్థులు ఉన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఆరుట్ల, మంచాల, వంగూరు, పోల్కంపల్లిలో వీటిని ప్రారంభించనుండగా.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 100 టీపీఎస్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
