రిజర్వేషన్ల కోటాపై సీఎం రేవంత్ ఊహించిందే జరిగిందా? ఆయనపై వారు ఒత్తిడి తెచ్చారా?
బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఆరు వారాల పాటు స్టే విధించడంతో తర్వాత ఏం జరుగుతోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

CM Revanth Reddy
Revanth Reddy: ఊహించిందే జరిగింది. అటు ఇటు తిరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్ రెండింటిపై హైకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో స్థానిక ఎన్నికల ఎపిసోడ్..రిజర్వేషన్లకు అడ్డంకులు ఏర్పడటంతో..ఈ వ్యవహారమంతా ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
ఎందుకంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్దంగా కల్పిస్తేనే ఆచరణ సాధ్యమవుతుందని, ఇలా జీవో ద్వారా ఇస్తే న్యాయపరంగా నిలబడదని లీగల్ ఎక్స్‌పర్ట్స్, ప్రతిపక్షాలు ముందు నుంచి చెబుతూనే ఉన్నాయి. ఇప్పుడు అదే జరిగిందని బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో తాను కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశానని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారట. (Revanth Reddy)
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధత కోసం అన్ని ప్రయత్నాలు చేశామని..దానిపై పూర్తి క్లారిటీ వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ధామని మంత్రులకు ముందే సీఎం రేవంత్ సూచించారట. కానీ మంత్రులు వినిపించుకోలేదని, జీవో ద్వారా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలకు వెళ్తామని మంత్రులు ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులంతా డైలమాలో
స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేయడంతో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులంతా డైలమాలో పడిపోయారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై గతంలో తాను లేవనెత్తిన అభ్యంతరాలను సీఎం రేవంత్ గుర్తు చేశారని తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో పూర్తి క్లారిటీ వచ్చాకే ఎన్నికలకు వెళ్తామని తాను చెబితే.. మంత్రులు వినిపించుకోలేదని, జీవో ద్వారా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్దామని మంత్రులు తొందరపెట్టినట్లు రేవంత్ వాపోతున్నారట.
ముందు నుంచి ప్రతిపక్ష పార్టీలు బీసీ రిజర్వేషన్ల విషయం తేలాకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ, జీవో ద్వారా రిజర్వేషన్లు ఇచ్చినా చెల్లదని చెబుతూ వస్తున్నాయని..ఇప్పుడు అలాగే జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుల దగ్గర ప్రస్తానిస్తున్నారట. మంత్రుల మాట విని తొందరపడి ఎన్నికలకు వెళ్లడంతో ఇప్పుడు కోర్టు బ్రేకులు వేసిందని, అంతే కాకుండా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దిని అంతా శంకించే పరిస్థితి ఏర్పడిందని రేవంత్ ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.
6 వారాల తర్వాత ఏం జరుగుతుంది?
బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఆరు వారాల పాటు స్టే విధించడంతో తర్వాత ఏం జరుగుతోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే అంతకు ముందు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఉండటంతో..అత్యున్నత న్యాయస్థానానికి వెళ్తే కూడా సానుకూల తీర్పు వస్తుందన్న నమ్మకం లేదన్న టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేమని సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తున్నారట. అలా కాదని మంత్రులు చెబుతున్నట్లు పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లినా ప్రతిపక్షాల నుంచే కాదు బీసీ వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారట.
బీసీ రిజర్వేషన్ల విషయంలో పూర్తి క్లారిటీ వచ్చాకే ఎన్నికలకు వెళ్తామని..తాను ఎంత చెప్పినా మంత్రులు వినిపించుకోకుండా తొందరపడటంతో ఇప్పుడు తాను, పార్టీ ఇరకాటంలో పడ్డామని రేవంత్ సన్నిహితుల దగ్గర ఆవేదన చెందుతున్నారని టాక్. రిజర్వేషన్ల ఎపిసోడ్ బూమరాంగ్ అవడంతో పాటు..స్థానిక ఎన్నికలు ఆగిపోవడంతో ఈ డ్యామేజ్‌ను ఎలా కవర్ చేసుకోవాలనేదానిపై కాంగ్రెస్ నేతలు మదన పడుతున్నారట.