Telangana : రాబోయే 5 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు

రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Telangana (3)

Telangana : తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు సాయంత్రం కుండపోత వర్షం కురుస్తుంది. నిమిషాల వ్యవధిలో ఆకాశంలో మబ్బులు కమ్మేసి కుండపోత వర్షం కురుస్తోంది. ఇక మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

రాగల ఐదురోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని, ఆ తర్వాత అల్పపీడనం వాయుగుండంలా మారే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. శనివారం ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.