కోవిడ్ కన్ఫ్యూజన్‌.. టీకా పంపిణీలో చిక్కుముడులు.. 50ఏళ్లు పైబడినవారిని గుర్తించడం ఎలా?

కోవిడ్ కన్ఫ్యూజన్‌.. టీకా పంపిణీలో చిక్కుముడులు.. 50ఏళ్లు పైబడినవారిని గుర్తించడం ఎలా?

Corona-Vaccine-immunity

Updated On : January 2, 2021 / 10:46 AM IST

Confusion over Corona Vaccine Distribution : కరోనా వ్యాక్సిన్ దాదాపు వచ్చేసింది.. ఇక టీకా పంపిణీ ఎలా చేయాలనేది పెద్ద కన్ఫ్యూజన్.. అయితే టీకా ఎవరికి ముందు? ఆ తర్వాత ఎవరెవరికి? ఇలా ప్రతిఒక్కరి డేటాను సేకరించాలి. సాధ్యమయ్యే పనేనా? ముందుగా 50 ఏళ్లు పైబడినవారితో పాటు అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను గుర్తించాలి. ఇప్పుడు ఇదే సర్కారుకు అతిపెద్ద సవాల్.. దీన్ని ఎలా అధిగమించాలనేది క్లిష్టతరంగా మారింది.

రాష్ట్రంలో 50 ఏళ్ల పైబడిన వ్యక్తులు దాదాపు 64 లక్షల మంది ఉంటారని అంచనా. ఇంతకీ వారందరిని ఎలా గుర్తించాలి? ఓటర్‌ ఐడీ కార్డులతో గుర్తించాలని తొలుత భావిస్తోంది. అలాగే టీకా లబ్ధిదారులు తమ వివరాలను కోవిన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసుకునేలా సూచనలు చేయొచ్చు. ఇంతవరకు బాగానే ఉంది.. మరి, గ్రామీణ ప్రాంతాల్లోని పెద్దగా అవగాహనలేని వారు తమ వివరాలను ఎలా కోవిన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారన్నది ప్రశ్నార్థంగా మారింది. రాష్ట్రంలో కొన్నిలక్షల మంది అతి తక్కువ వ్యవధిలో తమ వివరాలను అప్‌లోడ్‌ చేయడం సాధ్యమేనా? దీనికి సంబంధించిన ఏదైనా ప్రక్రియ మొదలైందా అంటే అవును అని చెప్పలేని పరిస్థితి.

ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్యంగా ఉన్నవారిని గుర్తించడం కత్తిమీద సాముతో కూడుకున్న వ్యవహారంగా చెబుతున్నారు విశ్లేషకులు. 50 ఏళ్లలోపు వ్యక్తుల్లో బీపీ, షుగర్, ఇతరత్రా అనారోగ్య బాధితులకు కరోనా టీకా అందించాలి. వీరిని గుర్తించడం అత్యంత సంక్లిష్టమైన వ్యవహారంగా వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో చాలా మందికి కనీసం బీపీ, షుగర్‌ ఉందన్న విషయం కూడా తెలియని పరిస్థితి. ఎవరికైనా అనారోగ్యమున్నా అందులో చాలామందికి కోవిన్‌ యాప్‌లో ఎలా అప్‌లోడ్‌ చేసుకోవాలో తెలియదు. ఈ సమస్యలను అధిగమించి టీకా పొందేవారి జాబితా తయారు చేయడంపై అధికారులకు కూడా క్లారిటీ లేదు.

50 ఏళ్ల లోపున్న అనారోగ్యంగా ఉన్నవారు 6 లక్షల మంది వరకు ఉండొచ్చని అంచనా. 50 ఏళ్లు పైబడినవారు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో ఆరోగ్య సమస్యలు ఉంటే వారి జాబితాను కూడా సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీనిపై కూడా ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ లేదు. మార్గదర్శకాలు సైతం తమకు రాలేదని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బందితో ఇంటింటికీ తిరిగి అందరి వివరాలను సేకరించాలన్నా సమయం సరిపోదు.. అతి తక్కువ సమయంలో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలడం సాధ్యమేనా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

యాప్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం క్యూలో గంటల తరబడి నిలబడి వ్యాక్సిన్ వేయించుకోవడం సాధ్యమేనా? ఉన్నచోట నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లి మరి టీకా వేయించుకోవాలంటే అందరూ అందుకు ఆసక్తి చూపిస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కరోనా వ్యాక్సిన్‌పై సోషల్‌ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారంతో ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందోనన్న అనుమానం తలెత్తుతోంది. 53 శాతం మంది కరోనా వ్యాక్సిన్‌ను వేసుకోనేది లేదని ఒక ఆన్‌లైన్‌ హెల్త్‌ పోర్టల్‌ నిర్వహించిన సర్వేలో తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ప్రజల్లో టీకాపై నాటుకుపోయిన అనుమానాలు, అపోహాలను తొలగించే ప్రయత్నాలు చేపట్టాలని సూచించింది.

టీకా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను లబ్ధిదారుల ఇష్టానికే వదిలేస్తే.. అది ఎంతవరకు సాధ్యమవుతుందనే ఆందోళన నెలకొంది. మరో ప్రధాన సమస్య ఏంటంటే? కరోనా వ్యాక్సిన్ అపోహల నేపథ్యంలో టీకా ఎందుకు వేయిచుకోవాలంటేనే భయపడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వారందరిని వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ఒప్పించడం అసలు కుదిరే పనేనా? వ్యాక్సినేషన్ ప్రాసెస్ ముందుకు సాగేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతా అనుకున్నట్టుగా జరిగితే వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగి అందరికి వ్యాక్సిన్ వేయడానికి సాధ్యపడుతుంది.