Congress Key Post For Teenmar Mallanna (Photo : Google)
బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై నిత్యం తీవ్ర విమర్శలతో విరుచుకుపడే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి లభించింది. మల్లన్నను కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ గా నియమించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ప్రకటన చేశారు. మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే పదవి వరించింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావ్ థాక్రే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో మల్లన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని కొంత కాలంగా ప్రచారం జరగ్గా.. ఆ ప్రచారానికి తెర దించుతూ ఆయన హస్తం గూటికి చేరారు. ఇలా పార్టీలో చేరారో లేదో అప్పుడు ఆయనకు పదవిని కట్టబెట్టారు కాంగ్రెస్ పెద్దలు.
Also Read : త్వరలో పెన్షన్ రూ.5వేలకు పెంపు, ఇకపై వారందరికి కూడా అమలు- సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్
గతంలో బీజేపీలో చేరిన మల్లన్న.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి అధికార పార్టీతో పాటు బీజేపీపైనా తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న. ఓ కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికలు, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
మల్లన్నకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే పనిగా పెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ పరిపాలన తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. మల్లన్నపై అనేక పోలీసులు కేసులు నమోదయ్యాయి. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తీన్మార్ మల్లన్న తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, అనుహ్యంగా సీఎం అభ్యర్థిత్వాన్ని సైతం వదులుకొని కాంగ్రెస్ గూటికి చేరారు మల్లన్న.
Also Read : నేను జైలుకెళ్లడానికి అతడే కారణం, శత్రువులతో చేతులు కలిపి- రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు