Revanth Reddy : నేను జైలుకెళ్లడానికి అతడే కారణం, శత్రువులతో చేతులు కలిపి- రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
Revanth Reddy Sensational Allegations : మిత్ర ద్రోహి.. శత్రువులతో చేతులు కలిపి జైలుకి పంపించారని తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామన్నారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy Sensational Allegations (Photo : Facebook)
తెలంగాణలో ఎన్నికల హీట్ తారస్థాయికి చేరింది. పోలింగ్ కు సమయం దగ్గరపడుతుంటంతో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది.
Also Read : త్వరలో పెన్షన్ రూ.5వేలకు పెంపు, ఇకపై వారందరికి కూడా అమలు- సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్
తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాలకుర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. డీలర్ గా ఉన్న దయాకర్ రావు డాలర్ దయాకర్ రావుగా మారారని ఆరోపించారు. ఎర్రబెల్లి మిత్ర ద్రోహి అన్న రేవంత్ రెడ్డి.. శత్రువులతో చేతులు కలిపి తనను జైలుకి పంపించారని తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో దయాకర్ రావును చిత్తుగా ఓడిస్తామన్నారు రేవంత్ రెడ్డి.
”40ఏళ్ల క్రితం డీలర్ గా ఉన్న దయాకర్ రావు ఇవాళ డాలర్ దయాకర్ రావు అయ్యారు. ఆనాడు రేషన్ డీలర్ గా జీవితాన్ని ప్రారంభించిన దయాకర్ రావుకు ఇన్ని వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయి? అమెరికాలో పెట్టుబడులు ఎలా వచ్చాయి? మీరంతా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎర్రబెల్లి దయాకర్ రావు పాపం పండింది. ఇన్నాళ్లూ చేసిన మోసాలకు ఇక్కడి ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు. దయాకర్ రావు అనే వ్యక్తి నమ్మక ద్రోహి, మిత్ర ద్రోహి. నమ్మించి మోసం చేయడంలో దయాకర్ రావును మించినోళ్లు లేరు. అందరికీ తెలుసు. నేను జైలుకి వెళ్లడానికి దయాకర్ రావు చేసిన ద్రోహమే కారణం. శత్రువులతో చేతులు కలిపారు. కుట్ర చేశారు. నేను జైల్లో ఉన్నాను అంటే.. దానికి ఎర్రబెల్లి దయాకర్ రావే కారణం” అని నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి ఏడ్చుకుంటూ వచ్చి నా కాళ్లు మొక్కాడు..
నేను జైలుకి వెళ్లడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావే అంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై మంత్రి ఎర్రబెల్లి ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి ఆరోపణలను ఆయన ఖండించారు. అసలు ఓటుకు నోటు విషయమే తనకు తెలియదన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డే నా కాళ్లు మొక్కాడని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. దందాలు మానుకోవాలని ఎన్నోసార్లు చెప్పినా రేవంత్ రెడ్డి వినలేదన్నారు.
Also Read : మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా ఎక్కువ రోజులు ఉండదు- బాంబు పేల్చిన బండి సంజయ్
”ఓటుకు నోటు కేసులో నేను ఇరికించాను అని రేవంత్ అంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి పోయేది తెలియదు, ఆయన చేసేది తెలియదు. నువ్వే వచ్చి నా కాళ్లు మొక్కావు. జైలు నుంచి బయటకు వచ్చాక ఏడ్చుకుంటూ నా ఇంటికి వచ్చి నా కాళ్లు మొక్కిపోయావు. అవన్నీ మర్చిపోయావా? దందాలు, బ్రోకరిజం బంద్ చేయమని రేవంత్ ని తిడుతుంటా. చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చావు. రెడ్డి కుటుంబంలో పుట్టావు. ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టావు. దయచేసి దందాలు బంద్ చేయ్ అని చెబితే నువ్వ నా మాట వినలేదు” అని రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు.