Komatireddy Venkat Reddy : మేడమ్ కొంచెం కరుణ చూపండి.. రూ.వెయ్యి జరిమానాపై కేంద్ర ఆర్థిక మంత్రికి కాంగ్రెస్ ఎంపీ లేఖ
Komatireddy Venkat Reddy : గ్రామీణ, మారుమూల ప్రాంత ప్రజలు ఇంటర్నెట్ సమస్యను కూడా ఎదుర్కొంటారని చెప్పారు.

Komatireddy Venkat Reddy(Photo : Google)
Komatireddy Venkat Reddy – Nirmala Sitharaman : పాన్ కార్డ్-ఆధార్ లింకింగ్ అంశంపై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. గడువు తేదీ ముగిసినప్పటికీ పాన్-ఆధార్ లింక్ చేయని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇంకా చాలామందికి పాన్-ఆధార్ ఎలా లింక్ చేయాలో తెలియదని తన లేఖలో కోమటిరెడ్డి తెలిపారు. గ్రామీణ, మారుమూల ప్రాంత ప్రజలు ఇంటర్నెట్ సమస్యను కూడా ఎదుర్కొంటారని చెప్పారు. అలాంటి వారి పట్ల సానుభూతితో సానుకూలంగా వ్యవహరించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారాయన. దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది పాన్-ఆధార్ లింక్ చేయలేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని, పెనాల్టీ రూపంలో అందరి మీద కలిపి మొత్తం రూ.30 వేల కోట్ల భారం పడుతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సామాన్యుల గురించి ఆలోచించి తీసుకోవాలని ఆయన కేంద్రమంత్రి నిర్మలకు సూచించారు. కేంద్ర ఆర్థిక శాఖ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఆర్థికమంత్రికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఆధార్ కార్డు, పాన్ కార్డు.. ఇండియన్స్ కు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్లు. కాగా, ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగేందుకు.. ఆధార్ తో పాన్ కార్డును అనుసంధానం చేసుకోవాలని కేంద్రం రూల్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి పలు మార్లు గడువు పొడిగించింది. చివరికి వెయ్యి రూపాయల జరిమానాతో జూన్ 30 వరకు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు ఆ గడువు కూడా ముగిసింది.
Also Read..MLA Rajaiah : కడియం శ్రీహరి పెద్ద అవినీతి తిమింగలం.. ఎమ్మెల్యే రాజయ్య సంచలన ఆరోపణలు
మీ పాన్ సంఖ్యను ఆధార్ సంఖ్యతో లింక్ చేశారో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ ఆధార్, పాన్ సంఖ్యలు ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. లింక్ అయి ఉంటే.. అక్కడ డిస్ప్లేపై కనిపిస్తుంది. ఇకపోతే ఆధార్, పాన్ కార్డు అనుసంధానం కాకపోతే ఇబ్బందులు తప్పవు.చాలా వరకు ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలోనూ సమస్యలు తప్పవు.