Cm Revanth Reddy
కులగణన చేపట్టి.. బీసీలకు రిజర్వేషన్లు పెంచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసి.. పొలిటికల్‌గా మైలేజ్ సాధిస్తామనుకున్న కాంగ్రెస్ నిర్ణయాలు రివర్స్ అవుతున్నాయా.. అనుకున్నది ఒకటి అవుతోంది ఒకటి అన్నట్లు మారిందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కులగణన విషయం రాజకీయంగా కలిసొస్తుంది అనుకుంటే.. మరింత బద్నాం కావాల్సి వస్తోందట. ఇంతకీ ఏం జరిగింది.. సీఎం రేవంత్ చెప్పిందేంటి.. నేతలు చేస్తుందేంటి.. అది పార్టీకి చేస్తున్న డ్యామేజ్ ఏంటి..
తెలంగాణలో కులగణన చేపట్టి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు పెంచి.. పొలిటికల్‌గా మైలైజ్ సాధించాలని కాంగ్రెస్ ఆలోచన చేసింది. దానికి అనుగుణంగా పక్కాగా సర్వే చేపట్టింది. దాదాపు 97శాతం వరకు జనాలు ఈ సర్వేలో పాల్గొన్నారని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. ముస్లీంలు, బీసీలు కలిపి రాష్ట్రంలో 56శాతానికి పైగా జనాలు ఉన్నారని సర్కార్ ప్రకటించగా.. దీనిపై విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలు, బీసీ కుల సంఘాల నాయకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయ్.
ప్రభుత్వం అలర్ట్
బీసీ జనాభా తగ్గించి చూపించారని.. సర్వే సరిగా జరగలేదనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. కులగణన సర్వే విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని కంట్రోల్ చేసేందుకు.. సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు స్వయంగా రంగంలోకి దిగారు. నష్టనివారణ చర్యలు చేపట్టారు. సర్వే తప్పు అని చెబుతున్న వారిని.. ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్వే ఎలా జరిగింది.. ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకున్నారు.. ఎంత పకడ్బందీగా చేశామన్నది సీఎంతో పాటు మంత్రులు పదేపదే విమర్శిస్తున్నా.. కులగణనపై విమర్శలు ఆగడం లేదు. నెగిటివ్ ప్రచారం కంటిన్యూ అవుతూనే ఉంది. దీంతో బీసీ నేతలను పిలిపించుకొని మరీ మీటింగ్ పెట్టారు సీఎం రేవంత్.
కులగణన విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేసిందన్నది వివరించారు. విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. బీసీ ముఖ్యనేతలంతా.. వారి సామాజికవర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. ప్రభుత్వ పనితీరును వివరించి పాజిటివ్‌గా మలచాలని సూచించారు. ఐతే ఇక్కడే సీన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది.
పూర్తిగా నెగిటివ్ అయిందనే గుసగుసలు
సమావేశంలో సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసింది ఒకటయితే.. బీసీ నేతలు ప్రవర్తించే తీరు మరోలా ఉంటోంది. యాదవ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్.. మాట్లాడిన మాటలు.. ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతున్నాయ్. ప్రభుత్వానికి, పార్టీకి పాజిటివ్‌గా మిగలాల్సిన మీటింగ్.. పూర్తిగా నెగిటివ్ అయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
ప్రభుత్వంలో యాదవులకు ప్రాధాన్యత లేదని.. మంత్రివర్గంలో అవకాశం లేకపోవడంతో పాటు.. పదవుల విషయంలో అన్యాయం జరిగిందని అంజన్ కుమార్ కామెంట్ చేశారు. ఇక్కడితో ఆగారా అంటే.. రెడ్డి సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ వర్గాన్ని టార్గెట్ చేస్తూ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ ఘాటు వ్యాఖ్యలు చేస్తుండగా.. ఇప్పుడు అంజన్ కుమార్ మాటలు.. మంటకు మరింత ఆజ్యం పోసినట్లు అయిందనే చర్చ జరుగుతోంది.
తాను రెడ్లను విమర్శించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అంజన్ కుమార్ యాదవ్ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక అటు పార్టీ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా రంగంలోకి దిగారు. ఒకరిద్దరు నేతలు చేసే కామెంట్స్ పరిగణనలోకి తీసుకోవద్దంటూ మేటర్ కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఏమైనా కులగణన వ్యవహారం.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చిచ్చును రాజేస్తున్నట్లు కనిపిస్తోంది. కులగణన ద్వారా అనుకున్నది ఒకటైతే.. అవుతోంది ఒకటనే టాక్ నడుస్తోంది.