ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీనియర్ నేత వీహెచ్ భేటీ

తనకు టికెట్ వచ్చే అవకాశం లేదని అలకబూనిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీనియర్ నేత వీహెచ్ భేటీ

V Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. వీహెచ్‌ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా సీఎం వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వీహెచ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఖమ్మం పార్లమెంట్ సీటు ఆశించి హనుమంతరావు భంగపడ్డారు. తనకు టికెట్ వచ్చే అవకాశం లేదని అలకబూనిన ఆయన కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మీడియా ముందు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి తనను కలవడం లేదని, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీఎం రేవంత్ స్పందించారు. హనుమంతరావును తన దగ్గరకు తీసుకురావాలని మహేష్ కుమార్ గౌడ్‌కు సూచించారు. సీఎం ఆదేశాలతో మహేష్ కుమార్.. వీహెచ్‌ను వెంట తీసుకెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు. పార్టీ విషయాలపై వారిద్దరూ మాట్లాడుకున్నట్టు సమాచారం. అన్ని విధాల అండగా ఉంటానని వీహెచ్‌కు సీఎం రేవంత్ భరోసాయిచ్చారని తెలుస్తోంది.

కాగా, ఢిల్లీలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణలోని 8 లోక్‌స‌భ‌ పెండింగ్ స్థానాలపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ఐదు స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చారని, మూడు స్థానాలపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోందని సమాచారం. ఈరోజు రాత్రికి అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

Also Read: ఒకే విమానంలో రేవంత్, హరీష్ రావు.. ఏం మాట్లాడుకున్నారో తెలియాలి : రఘునందన్ రావు