ఆన్‌లైన్‌లో పంచాయతీ ఎన్నికల సమాచారం
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాల పరిధిలోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళల రిజర్వేషన్లు, అన్–రిజర్వ్‌డ్ స్థానాలను అధికారికంగా ప్రకటించిన వెంటనే పల్లెల్లో ఆయా స్థానాలకు పోటీ చేసే ఆశావహుల తాకిడి ఒక్కసారిగా పెరుగనుంది.
వెబ్‌సైట్‌లో సమాచారం
పంచాయతీకి పోటీ చేసే వారి వివరాలు మొదలు, నామినేషన్లు, ఫలితాల వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) వెబ్‌సైట్‌లో తెలుసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేసే వారు, ఉపసంహరించుకునేవారు, పోటీ చేస్తున్న వారి వివరాలు ఈ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో టీ ఈ–పోల్ లాగిన్, అబ్జర్వర్ పోర్టల్, క్యాండిడేట్ పోర్టల్, ఓటర్ పోర్టల్, ఈవీఎం ట్రైనింగ్ మాడ్యూల్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై అవగాహన
వీటి ద్వారా ఆయా అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది. వీటితో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ, ఇతర విషయాలపై అవగాహనతోపాటు ఎప్పటికప్పుడు ఎస్‌ఈసీకి సంబంధించిన సమాచారాన్ని, వివరాలు తెలుసుకోవచ్చు. పోటీచేసే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాండిడేట్ పోర్టల్‌లో సర్పంచ్‌గా పోటీచేసేందుకు అర్హతలు, పాటించాల్సిన నియమ నిబంధనలు, తదితర వివరాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఎన్నికల ఫలితాల సమాచారం..
నామినేషన్ల దాఖలు మొదలు పంచాయతీ ఫలితాలు కూడా ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుండడంతో రాష్ట్రంలోని ఏ గ్రామంలో ఎవరు గెలిచారో ఎవరైనా తెలుసుకునేందుకు వీలు ఏర్పడనుంది. పోటీచేసే వారికే కాకుండా ఈ ఎన్నికల్లో ఓట్లు వేసే వారికి కూడా ఈ వెబ్‌సైట్ ద్వారా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోగలిగినట్టే, గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ఓటర్లు తమ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు కూడా ఈ పోర్టల్ ఉపయోగకరంగా ఉంటుంది.
అధికారులు పాటించాల్సిన విధి విధానాలు
అధికారులు పాటించాల్సిన విధివిధానాలు, అభ్యర్థుల ఎన్నికల ప్రచారం, ఇతరత్రా వ్యయ పరిశీలన, అబ్జర్వర్ల నివేదికలు ఎలా సమర్పించాలనే అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు. దీంతో ఎన్నికల విధులు నిర్వహించే అధికారుల పని కూడా సులువు అవుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఆయా అంశాలను పొందుపరచడంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అప్‌డేట్స్, నోటిఫికేషన్స్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని కూడా అధికారులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.