కుటుంబంలో ఒక్కరికి కరోనా.. అందరి జీవితాలు చిదిమేసింది!!

కుటుంబంలో ఒక్కరికి కరోనా.. అందరి జీవితాలు చిదిమేసింది!!

Updated On : December 31, 2020 / 9:57 AM IST

మహమ్మారి కరోనా.. మయాదారి కరోనా.. ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంపై ఏదో రకంగా ప్రభావం చూపించింది. ఆర్థిక నష్టం కొందరిదైతే.. ప్రాణ నష్టం మిగిలిన వారిది. ఎన్నో ఆశలు, ఆనందాలు అన్నింటినీ గాలిలో కలిపేసింది. తెలంగాణలోని ఒక కుటుంబంలో ఒకరికి కరోనా వచ్చిన కారణంగా ఆమె తండ్రి గుండెపోటు, తల్లి మంచానికే పరిమితం, సోదరుడికి మనోవేదనకు గురయ్యేలా చేసింది.

ఎల్పీనగర్ పోలీస్ స్టేషన్ లో ఉండే కుటుంబానికి చెందిన వివరాలిలా ఉన్నాయి. నీటిపారుదల శాఖలో పని చేసి రిటైర్ అయిన మాజీ ఉద్యోగి బాలనర్సయ్య(70). హైదరాబాద్‌ బండ్లగూడలో ఏడాది క్రితం కొత్తగా ఇల్లు కట్టుకుని అక్కడే కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుక్కి కొన్నేళ్ల క్రితమే వివాహం అయింది. చిన్న కొడుకు ముషీరాబాద్‌లోని ఓ షోరూంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.

సీతారామ సాయిప్రసాద్‌ వర్మ(31) అనే ఈ వ్యక్తికి ఏడాది క్రితం సిరితో వివాహం జరిపించారు. కుటుంబంలోని వారంతా ఒకే ఇంట్లో వేర్వేరు అంతస్తుల్లో ఉంటున్నారు. ఆర్నెల్ల క్రితం పెద్ద కుమార్తె అనారోగ్యానికి గురవడంతో బాలనర్సయ్య స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కుమార్తెకు కరోనా సోకిందని తెలిసి ఆందోళనకు గురైన ఆయనకు విషయం తెలియగానే హార్ట్ అటాక్ వచ్చింది.

ట్రీట్‌మెంట్ కోసం అదే హాస్పిటల్‌లో చేరిన ఆయన 3 రోజుల తర్వాత తుదిశ్వాస విడిచారు. తండ్రి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేని చిన్నకొడుకు సీతారామ సాయిప్రసాద్‌ వర్మ అప్పట్నుంచి మానసికంగా సరిగా ఉండడం లేదు. మెంటల్ కండీషన్ దెబ్బతిన్న అతనికి పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించగా ఇటీవలే కోలుకున్నాడు. కుమారుడి పరిస్థితి బాగాలేకపోవడం, ధైర్యం చెప్పే భర్త తోడులేకపోవడంతో భార్య నాలుగు నెలలుగా పక్షవాతంతో మంచాన పడింది.

సీతారామ సాయిప్రసాద్‌ వర్మ కొంతకాలం క్రితం కోలుకుని ఉద్యోగానికి వెళ్తున్నాడు. ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్న ఆమె..పురుడు కోసం రెండు వారాల క్రితం రామాంతాపూర్‌లోని పుట్టింటికి వెళ్లింది. ఆమెతోపాటు అత్తారింటికి వెళ్లిన ప్రసాద్‌ వర్మ మంగళవారం తిరిగి బండ్లగూడకు వచ్చాడు. రాత్రిపైఅంతస్తులో సోదరిడితోపాటే నిద్రించాడు. అర్ధరాత్రి తర్వాత కింది అంతస్తులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో గమనించిన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిన్న కుమారుడి మరణంతో తల్లి మరింత కుంగిపోగా, గర్భవతి అయిన భార్య అత్తారింటికి వచ్చి భర్తను అలా చూసి షాక్ కు గురైంది. ఇదే సమయంలో పురిటినొప్పులు రావడంతో ఆమెను ఉప్పల్‌లోని ప్రసూతి ఆస్పత్రికి తరలించారు.