కేసీఆర్ సర్కార్‌కు కార్పొరేషన్‌ కష్టాలు..ప్రభుత్వానికి మోయలేని భారంగా కార్పొరేషన్లు

కేసీఆర్ సర్కార్‌కు కార్పొరేషన్‌ కష్టాలు..ప్రభుత్వానికి మోయలేని భారంగా కార్పొరేషన్లు

Updated On : January 11, 2021 / 11:51 AM IST

Debts above Rs 1.5 lakh crore through corporations : తెలంగాణ ప్రభుత్వానికి కార్పొరేషన్ల కష్టాలు మొదలయ్యాయా? రాష్ట్రానికి ఆర్థిక క‌ష్టాల‌ను దూరం చేసుకునేందుకు తీసుకొచ్చిన కార్పొరేష‌న్లు.. కేసీఆర్ స‌ర్కార్ కు గుదిబండ‌లా త‌యార‌య్యాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తోన్నాయి. క‌రోనాతో ఖ‌జానాకు రాబ‌డి త‌గ్గడం, మ‌రోవైపు రోజు రోజుకు పెరుగుతున్న అప్పుల భారం ఇప్పుడు కేసీఆర్ స‌ర్కార్ ను ఉక్కిబిక్కిరి చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయ‌డం స‌హ‌జం. వారు అమ‌లు చేస్తున్న సంక్షేమ పథ‌కాలకు నిధుల స‌మ‌స్యలు వ‌చ్చిన‌ప్పుడు.. ప్రభుత్వాలు వాటిని కొనసాగించేందుకు అప్పుల బాట ప‌డ‌తాయి. అలా అని ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయడానికి వీలుండదు. ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వం FRBM చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం రాష్ట్రాలు తమ స్థూల ఆదాయంలో 3 శాతానికి మించి అప్పులు చేయరాదు. అయితే తెలంగాణ ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్ రాష్ట్రం కావడం కావ‌డంతో, రాష్ట్ర స్థూల ఆదాయంలో 3.5 శాతం వరకు అప్పులు తీసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ వెసులుబాటును వినియోగించుకున్న తెలంగాణ‌ ప్రభుత్వం ఇప్పటికే బహిరంగ మార్కెట్ నుంచి 3 లక్షల కోట్ల అప్పులు చేసింది.

తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బంధు, ఉచిత విద్యుత్, రుణ‌మాఫి, ఆస‌రా ఫించ‌న్లు, కళ్యాణలక్ష్మి లాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. సంక్షేమ పథ‌కాల‌తో పాటు భారీగా సాగునీటి ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, దుమ్ముగూడేం, తుపాకుల గూడెం… వీటితో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణాన్ని బుజానికి ఎత్తుకుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అప్పుల కోసం కార్పొరేషన్లు తెరపైకి తీసుకువచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ కార్పొరేషన్లే తెలంగాణ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నాయి.

FRBM ప్రకారం అదనంగా అప్పు చేయడానికి కేంద్రం నిరాకరించడంతో సాగునీటి ప్రాజెక్టులతో పాటు, ఇతర అవ‌స‌రాల‌కు అప్పులు చేయడానికి తెలంగాణ‌ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులకు ప్రభుత్వమే గ్యారంటీ ఉంటూ.. అప్పులు తీసుకుంది. ఇలా ఏర్పాటు చేసిన‌వే కాళేశ్వరం కార్పొరేషన్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల కార్పొరేషన్, తెలంగాణ వాటర్ గ్రిడ్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్లు. ఈ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే లక్షన్నర‌ కోట్లకు పైగా అప్పులు చేసిన‌ట్లు స‌మాచారం.

ఇలా 2018-2019 ఆర్థిక సంవ‌త్సరం నాటికి కార్పొరేషన్ల ద్వారా తెలంగాణ స‌మ‌కూర్చుకున్న అప్పులు 94 వేల కోట్లు. వాటిలో కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా 24 వేల కోట్లు, మిష‌న్ భ‌గీర‌థ, వాట‌ర్ గ్రిడ్ కార్పొరేషన్‌ కోసం 20 వేల కోట్లు, దేవాదుల కార్పొరేషన్‌ నుంచి 20 వేల కోట్లు ,హౌసింగ్ కార్పొరేషన్‌కు 10 వేల కోట్లు, పాల‌మూరు రంగారెడ్డి కార్పొరేషన్‌ ద్వారా 20 వేల కోట్లు అప్పులు తెచ్చిన‌ట్లు తెలంగాణ ప్రభుత్వం 2018-2019 బ‌డ్జెట్ లో ప్రక‌టించింది. అయితే ఇప్పుడు ఈ అప్పులు ల‌క్షన్నర కోట్లకు పైగానే చేరిన‌ట్లు అధికార వ‌ర్గాల స‌మాచారం.

రాష్ట్ర అవసరాల కోసం కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులు కేసీఆర్ ప్రభుత్వానికి భారంగా మారాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించిన మేర లేకపోవడం, ఖజానా ఖాళీ అవుతుండటం కార్పొరేషన్లు ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. మరి వీటి నుంచి సర్కార్ ఏ విధంగా గట్టెక్కుతుందో చూడాలి.