PG Medical Seats Scam : మెడికల్ పీజీ సీట్ల కౌన్సిలింగ్‌లో అవకతవకలు జరగలేదు -డీఎంఈ రమేశ్ రెడ్డి
మెడికల్ పీజీ సీట్ల కౌన్సిలింగ్ లో అవకతవకలు జరిగినట్టు వార్తలు రావడంపై డీఎంఈ రమేశ్ రెడ్డి స్పందించారు. అందులో ఎటువంటి నిజం లేదన్నారు.(PG Medical Seats Scam)

Pg Medical Seats Scam
PG Medical Seats Scam : మెడికల్ పీజీ సీట్ల కౌన్సిలింగ్ లో అవకతవకలు జరిగినట్టు వార్తలు రావడంపై డీఎంఈ రమేశ్ రెడ్డి స్పందించారు. అందులో ఎటువంటి నిజం లేదని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇచ్చేందుకే మీడియా ముందుకు వచ్చామన్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 100 సీట్లు ఉంటే అందులో 50 మాత్రమే కన్వీనర్ కోటాలో ఉంటాయన్నారు. మిగతా వాటిలో 10శాతం మేనేజ్ మెంట్ కోటా కింద డైరెక్ట్ గా ఫిల్ చేసుకోవచ్చన్నారు. సీట్ బ్లాకింగ్ వంటివి కేవలం మేనేజ్ మెంట్ కోటాలోనే ఉంటుందని తెలిపారు.
సెకండ్ కౌన్సిలింగ్ పూర్తయ్యాక 16 మంది బయట రాష్ట్రాల వారు వచ్చారని రమేశ్ రెడ్డి తెలిపారు. గత నెల 16న వారందరికి లెటర్ రాశామన్నారు. మీ రాష్ట్రాల్లో సీటు వచ్చే ఛాన్స్ ఉందని, మెరిట్ విద్యార్థులు కావడంతో వారికి ముందుగా చెప్పడం జరిగిందన్నారు. ఒకవేళ బ్లాక్ చేసేందుకు వారు ఈ స్కామ్ లో ఉన్నట్టు తెలిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పామన్నారు.
అయితే వారిలో ఐదుగురు తాము అప్లయ్ చెయ్యలేదని మెయిల్ పెట్టారని అన్నారు. అప్పుడు తమకు అనుమానం వచ్చిందని, పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఏప్రిల్ 6న రెండో రౌండ్ కూడా కౌన్సెలింగ్ చెయ్యమని అనుమతి ఇచ్చిందన్నారు. ఆల్ ఇండియా కోటా అయిపోయింది కాబట్టి స్టేట్ కోటా లో మరోసారి మాప్ అప్ నిర్వహించేందుకు అనుమతి పొందామన్నారు. వరంగల్ సీపీకి కంప్లైంట్ ఇచ్చామని, వారు విచారణ చేపట్టారని డీఎంఈ రమేశ్ రెడ్డి తెలిపారు. ఖాళీగా ఉన్న సీట్లకు అన్నింటికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. నేషనల్ కౌన్సిల్ కి కూడా చెప్పనున్నామన్నారు.(PG Medical Seats Scam)
వైద్య విద్యలో స్పెషలైజేషన్ చేసే పీజీ సీట్లకు ‘బ్లాక్’ దందా వ్యవహారం ఇటీవల వెలుగు చూసింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కోట్లకు కోట్లు దండుకోవడానికి అక్రమ మార్గాల బాటపట్టాయి. ‘నీట్’లో మంచి ర్యాంకు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులతో ఇక్కడ దరఖాస్తు చేయించడం.. వారికి మేనేజ్‌మెంట్ కోటా సీటు అలాట్ అయ్యాక దానిని వదులుకుని వెళ్లిపోతున్నట్టు చెప్పించడం జరుగుతోంది. తర్వాత ఎన్నారై కోటా కింద ఆ సీటును భారీ ధరకు అమ్ముకుంటున్నారు కేటుగాళ్లు. దీని వల్ల మంచి ర్యాంకు వచ్చినా స్థానికంగా సీటు దొరక్క రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని.. ఈ వ్యవహారంపై విద్యార్థుల ఒత్తిడితో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ షాపులు
ప్రైవేట్ కాలేజీలు.. కొందరు విద్యార్థుల తోడ్పాటుతో ఉద్దేశపూర్వకంగా సీట్లను బ్లాక్ చేస్తున్నట్టుగా కాళోజీ వర్సిటీ గుర్తించింది. ఇప్పటివరకు జరిగిన మూడు దశల కౌన్సెలింగ్‌లో 40 మంది దరఖాస్తులు అనుమానాస్పదంగా ఉన్నట్టు తేల్చింది. ఈ 40 మందీ మంచి ర్యాంకులు సాధించిన వారేనని గుర్తించింది. వారికి సొంత రాష్ట్రాల్లోనే సీటు పొందే అవకాశం ఉన్నా.. మన రాష్ట్రంలో, అదీ యాజమాన్య కోటాలో దరఖాస్తు చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వర్సిటీ దీనిపై వివరణ కోరుతూ వారందరికీ లేఖలు రాసింది.
అయితే తాము మేనేజ్ మెంట్ కోటా కింద ధరఖాస్తు చేయలేదని వారు చెప్పడంతో యూనివర్శిటీ అధికారులకు అనుమానం వచ్చింది. మెరిట్ స్టూడెంట్స్ పేరుతో వేరే వ్యక్తులు ఎవరైనా ఈ పని చేశారా అనే విషయమై కాళోజీ యూనివర్శిటీ అధికారులు అనుమానంతో ఉన్నారు. ఈ విషయమై వాస్తవాలు తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజ్ మెంట్ కోటా లో ఎంక్యూ 1,2,3 కింద సీట్లను భర్తీ చేస్తారు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన మెరిట్ విద్యార్ధులతో మేనేజ్ మెంట్ కోటా సీట్ల కోసం ధరఖాస్తు చేయించిన విషయాన్ని కాళోజీ యూనివర్శిటీ అధికారులు గుర్తించారు. సీట్లను బ్లాక్ చేసే ఉద్దేశ్యంతో ఇలా చేశారా అనే అనుమానాన్ని యూనివర్శిటీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో వెలుగుచూసిన మెడికల్ పీజీ సీట్ల స్కామ్ కలకలం రేపింది. పేద విద్యార్థులకు అందాల్సిన సీట్లను కొందరు యూనివర్సిటీ అధికారులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు కోట్ల రూపాయలకు అమ్మేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిభ ఉన్న విద్యార్థులకు దక్కాల్సిన సీట్లు కోట్లు కుమ్మరించగల వారికి వెళ్లిపోతున్నాయని, మెడికల్ సీట్ల స్కాం పక్కా ప్లాన్‌తో జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. ముందు సీట్లను బ్లాక్ చేసి తర్వాత వాటిని అమ్మేసేందుకు స్కామ్ గ్యాంగ్ స్కెచ్ వేసినట్టు అనుమానిస్తున్నారు. ఇలాంటి 40కి పైగా అనుమానాస్పద దరఖాస్తులను గుర్తించారు యూనివర్సిటీ రిజిస్ట్రార్.(PG Medical Seats Scam)
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 33 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 20 ప్రైవేటు, 4 మైనారిటీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల పరిధిలో మొత్తం 2295 మెడికల్ పీజీ సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా 1090, ఆల్ ఇండియా కోటా 512, మేనేజ్ మెంట్ కోటా 693 కింద సీట్లు కేటాయించారు. అయితే 40కి పైగా సీట్లలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్. స్ట్రే వెకెన్సీ ఆప్షన్ ఆధారంగా యాజమాన్యాలు సీట్లు బ్లాక్ చేస్తున్నాయంటున్నారు. ఒక్కో సీటును 2 కోట్ల రూపాయలకు పైగా విక్రయించినట్లు యూనివర్సిటీకి సమాచారం అందింది. దీంతో పీజీ సీట్ల బ్లాక్ దందాపై వరంగల్ పోలీస్ కమిషనర్‌కు కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. మెడికల్ సీట్ల దందాపై పోలీసులు కూపీ లాగుతున్నారు.
మెరిట్ స్టూడెంట్ తొలుత మేనేజ్ మెంట్ కోటా కింద ధరఖాస్తులు చేయించి ఆ తర్వాత చేరకుండా వెళ్లిపోతున్నారు. దీంతో ఈ సీటు బ్లాక్ అవుతుంది. ఇలా బ్లాక్ అయిన సీటును చివర్లో మేనేజ్ మెంట్ కోటా కింద కోటి రూపాయల నుండి రూ.2 కోట్లకు విక్రయించుకునే వీలుంది. ఈ కారణంగానే మెరిట్ విద్యార్ధులతో మేనేజ్ మెంట్ కోటాలో ధరఖాస్తు చేయించారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. అయితే మెడికల్ సీట్లను బ్లాక్ చేసే ఉద్దేశ్యంతోనే ఇలా చేశారా లేదా ఇతరత్రా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.
మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందా వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విద్యార్ధులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ అధికారులను కోరారు.