DSC Exams : నిన్న గ్రూప్-2, నేడు డీఎస్సీ పరీక్షలు వాయిదా.. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటన
5వేల 89 టీచర్ పోస్టులకు నవంబర్ 20 నుంచి 30 తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. DSC Exams Postponed

DSC Exams Postponed (Photo : Google)
DSC Exams Postponed : తెలంగాణలో వరుసగా పరీక్షలు వాయిదా పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కారణంగా పరీక్షలు వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే గ్రూప్-2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఇప్పుడు డీఎస్సీ కూడా పోస్ట్ పోన్ అయ్యింది. తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు (డీఎస్సీ) వాయిదా పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది.
టీచర్ రిక్రూట్ మెంట్ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది విద్యాశాఖ. 5వేల 89 టీచర్ పోస్టులకు నవంబర్ 20 నుంచి 30 తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎగ్జామ్స్ ను వాయిదా వేశారు.
Also Read : ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగ ఖాళీల భర్తీ
ఎన్నికలే కారణం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 30న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ క్రమంలో పోటీ పరీక్షలు వాయిదా వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవలే ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2, 3 తేదీల్లో.. గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది.
వాయిదాల పర్వం..
783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్ జారీ చేయగా.. 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండడంతో.. గ్రూప్-2ను వాయిదా వేయాలంటూ నిరుద్యోగుల నుంచి డిమాండ్లు రావడంతో పరీక్షలను వాయిదా వేసింది టీఎస్ పీఎస్ సీ. నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్-2ను నిర్వహిస్తామంది.
Also Read : ప్రగతి స్కాలర్ షిప్ పధకం 2023..ఏడాదికి 50,000రూపాయలు
సిబ్బంది కొరత..
అయితే.. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో నామినేషన్లు, ఇతర పనుల కారణంగా సిబ్బందిని సమకూర్చలేమంటూ జిల్లాల కలెక్టర్లు టీఎస్ పీఎస్సీకి తెలిపారు. గ్రూప్-2 పరీక్ష కేంద్రాల దగ్గర పోలీసు బందోబస్తు సాధ్యం కాకపోవచ్చని ఎస్పీలు వివరించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న టీఎస్ పీఎస్ సీ.. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో ఆ పరీక్షలను నిర్వహిస్తామంది.