SRH HCA : ఎస్ఆర్ హెచ్, హెచ్ సీఏ మధ్య టికెట్ల వివాదానికి ఎండ్ కార్డ్..
స్టేడియంలో ప్రేక్షకులకు మెరుగైన అనుభవాన్ని ఇచ్చేలా రెండు వర్గాలు కలిసి స్నేహపూర్వకంగా పని చేయాలని నిర్ణయించారు.

SRH HCA : ఐపీఎల్ టికెట్లు, పాసుల విషయంలో ఎస్ఆర్ హెచ్, హెచ్ సీఏ మధ్య చెలరేగిన వివాదం సమసిపోయింది. ఎస్ఆర్ హెచ్, హెచ్ సీఎఏ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. హెచ్‌సీఏ కార్యదర్శి దేవ్‌రాజ్ ఎస్ఆర్ హెచ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఆర్ హెచ్ ప్రతినిధులు కిరణ్, శరవణన్, రోహిత్ పాల్గొన్నారు. చర్చల సందర్భంగా ఇరువర్గాల మధ్య పలు కీలకమైన అంశాలు తెరపైకి వచ్చాయి.
పాత ఒప్పందం ప్రకారమే స్టేడియం కెపాసిటీలో 10శాతం కాంప్లిమెంటరీ పాసుల కేటాయింపునకు ఎస్ఆర్ హెచ్ అంగీకరించింది. బీసీసీఐ, ఎస్ఆర్‌హెచ్, హెచ్‌సీఏ మధ్య ఉన్న ట్రైపార్టీ ఒప్పందం మేరకు పని చేసేందుకు ఇరు వర్గాలు అంగీకారం తెలిపాయి. అన్ని విభాగాల్లో అందుబాటులో ఉన్న స్టేడియం సామర్థ్యంలో 10శాతం టికెట్లు కేటాయించాలని ప్రతిపాదించింది.
Also Read : అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం.. తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న హెచ్‌సీయూ భూముల వివాదం..
హెచ్ సీఏ సంవత్సరాలుగా అనుసరిస్తున్న పద్ధతినే ప్రతి కేటగిరీలో ఇప్పుడున్న పాసుల కేటాయింపును కొనసాగించాలని ప్రతిపాదించింది. దీనికి ఎస్ ఆర్ హెచ్ సీఈవో అంగీకరించారు. హెచ్ సీఏకి 3వేల 900 ఉచిత పాసుల కేటాయింపు అనేది మారదని స్పష్టం చేశారు. ఇక స్టేడియంలో ప్రేక్షకులకు మెరుగైన అనుభవాన్ని ఇచ్చేలా రెండు వర్గాలు కలిసి స్నేహపూర్వకంగా పని చేయాలని నిర్ణయించారు. దీనిపై రెండు వర్గాలు సంయుక్త ప్రకటన చేశాయి. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లు అయ్యింది.
వివాదానికి అసలు కారణం ఇదే..
ఐపీఎల్ టికెట్లు, పాసుల విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్, హెచ్ సీఏ మధ్య వివాదం చెలరేగింది. ఎస్ఆర్ హెచ్ టీమ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్.. హెచ్ సీఏ ట్రెజరర్ శ్రీనివాస్ రావుకు మెయిల్ పంపారు. అందులో చాలా అంశాలు ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల ఉచిత పాసుల కోసం హెచ్ సీఏ.. ఎస్ఆర్ హెచ్ మేనేజ్ మెంట్ ను ఇబ్బంది పెడుతోందని, వేధిస్తోందని, బ్లాక్ మెయిల్ చేస్తోందని మెయిల్ లో వాపోయారు.
దాదాపు 10శాతం పాసులు అంటే 3వేల 900 ఉచిత పాసులు ఇచ్చినా.. ఇంకా కాంప్లిమెంటరీ పాసులు కావాలని ఒత్తిడి చేస్తున్నారని, అడిగినన్నీ టికెట్లు ఇవ్వలేదని మ్యాచ్‌కు ముందు కార్పొరేట్ బ్యాక్స్ కి తాళం వేసి వేధించారని మెయిల్ లో తెలిపారు. ఈ వ్యవహారం బయటకు రావడం, దుమారం రేగడంతో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.