ఫ్యాన్సీ నంబర్ల కోసం కోటీశ్వరుల కొట్లాట 

  • Published By: chvmurthy ,Published On : April 16, 2019 / 02:59 AM IST
ఫ్యాన్సీ నంబర్ల కోసం కోటీశ్వరుల కొట్లాట 

హైదరాబాద్: ఖరీదైన కారు వాడటం సొసైటీలో స్టేటస్ సింబల్, ఆకారుకు ఫ్యాన్సీ నెంబర్ ఉందంటే అదో క్రేజ్ … బడా బాబులు ఫ్యాన్సీ నెంబర్లు కోసం ఆర్టీఏ లో అదనపు చార్జీలు చెల్లించి, తమకు నచ్చిన, లక్కీ ఫ్యాన్సీ నంబరును కైవసం చేసుకుంటూ ఉంటారు. అందుకే ఫ్యాన్సీ నంబర్ల కోసం ఆర్టీఏ అధికారులు వేలంపాట వేసి సంస్ధకు ఆదాయం సమకూర్చుకుంటూ ఉంటారు. ఐతే సోమవారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఒకే నంబరు కోసం ఇద్దరు పోటీపడి, ఒకరిపై ఒకరు చేయిచేసుకునే దాకా వెళ్లింది. కోటీశ్వరులు కూడా ఫ్యాన్సీ నంబరు కోసం సహనం కోల్పోయి ఒకరిపై ఒకరు దాడిచేసుకునేంత దాకా వెళ్ళిందంటే నంబర్లకున్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.  ఖైరతాబాద్ సెంట్రలో జోన్ ఆర్టీఏ ఆఫీసులో సోమవారం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా సంస్ధకు ఒక్క రోజులోనే 30 లక్షల 55వేల 748  రూపాయలు  ఆదాయం వచ్చింది. 

ప్రస్తుత నడుస్తున్న TS 09 FE సిరీస్ లో 9999  నంబరు రూ.10 లక్షలు పలికింది. దీన్ని ఎన్ఎస్ఎల్ ప్రాపర్టీస్ సంస్ధ కైవసం చేసుకుంది. పాత సిరీస్ ముగిసి కొత్త సిరీస్  TS 09 FF లోకి అడుగు పెట్టింది. అందులో 1 వ నెంబరు కోసం FRR హిల్ హోటల్స్ సంస్ధ రూ.06.95 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. 99 నంబరును ఎమర్జిన్ అగ్రినోవా సంస్ధ రూ.2.78 లక్షలు చెల్లించి దక్కించుకుంది.  కాగా ఇక్కడ 9 వ నంబరుకు డిమాండ్ ఉన్నప్పటికీ ఈసారి అధికారులు నిర్ణయించిన రూ.50 వేలకే పోవడం గమనించదగ్గవిషయం.
 
కొత్తసిరీస్ ప్రారంభ కావటంతో డిమాండ్ ఉన్న 0001 నెంబరు కోసం ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఫ్యాన్సీ నంబరు కావాలంటే ఆర్టీఏ అధికారులు నిర్ణయించిన ధరతో పాటు అదనంగా  ఆ నంబరుకు వారు ఎంతపెట్టదలుచుకున్నారో ఆమొత్తాన్ని చెక్కుల రూపంలో టెండర్ బాక్సులో వేయాలి. సోమవారం నాడు 0001 నంబరు కోసం నలుగురు వ్యక్తులు నిర్ణీత సమయంలో టెండరు వేశారు. టెండర్ బాక్సులో కవర్లు తీసుకువెళుతున్న సమయంలో మరోక వ్యక్తి వచ్చి తన టెండర్ కవర్ వేసే ప్రయత్నం చేయటంతో అప్పటికే కవర్ వేసిన ఒక వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. దాంతో సహనం కోల్పోయిన కొత్తవ్యక్తి అతడిపై దాడి చేశాడు. కాగా…సమయం మించిపోవటంతో అధికారులు ఆదరఖాస్తును రిజెక్ట్ చేశారు.