గ్రీన్ జోన్ అయిన మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు, అంబులెన్స్ లో చనిపోయిన మహిళకు పాజిటివ్

Coronavirus
తెలంగాణ రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా వైరస్ సోకింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళను అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌కు తరలించారు. కాగా ఏప్రిల్ 14న ఆమె మృతిచెందింది. అప్పటికే ఆమే శాంపిల్స్ ను టెస్టింగ్‌కు పంపగా వచ్చిన రిపోర్ట్‌లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారలు ముత్తరావుపల్లిలో హైఅలర్ట్ ప్రకటించారు. గ్రామంలో ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలతో పాటు, ఆమెతో అనుబంధం ఉన్నవారి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
కింగ్ కోఠి ఆస్పత్రి ప్రాంగణంలో అంబులెన్స్‌లోనే చనిపోయిన మహిళకు కరోనా:
మృతురాలు కింగ్ కోఠి ఆస్పత్రి ప్రాంగణంలో అంబులెన్స్‌లోనే ప్రాణాలు విడిచింది. మహిళకు కరోనా పాజిటివ్ అని తేలడంతో మంచిర్యాల జిల్లాలో అలజడి రేగింది. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో కరోనా కేసులు నమోదైనా.. మంచిర్యాల జిల్లా ఇప్పటివరకూ కరోనా గ్రీన్ జోన్‌గా ఉంది. తాజా ఘటనతో కలవరం మొదలైంది. సదరు మహిళతో ఎంత మంది కాంటాక్ట్ అయ్యారనే వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. మంచిర్యాలలో ఆమెకు చికిత్స అందించిన వైద్యుల్లోనూ కలవరం మొదలైంది. గ్రామంలో హైఅలర్ట్ విధించారు. తాజా ఘటనతో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 19కి చేరింది. దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
ఆమెకి కరోనా ఎలా సోకింది?
ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన 46 ఏళ్ల ఓ మహిళ వారం రోజుల కిందట అస్వస్థతకు గురైంది. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆమెను కుమారులు మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలుగా అనుమానించారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అయితే, తమ తల్లికి కరోనా సోకే అవకాశమే లేదని వాదించిన ఆమె కుమారులు హైదరాబాద్ తీసుకెళ్లడానికి నిరాకరించారు.
చివరికి వైద్యులు, అధికారుల ఒత్తిడి మేరకు బాధితురాలిని 108 అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, ఆమెకు కరోనా వైరస్ ఉన్నట్లు అప్పటికి నిర్ధారణ కాకపోవడంతో కింగ్ కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా గాంధీలోని వైద్య సిబ్బంది సూచించారు. దీంతో చేసేదేం లేక ఆమె కుమారుడు కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా ఆ మహిళ అంబులెన్స్‌లోనే ప్రాణాలు విడిచింది.
అధికారుల నిర్లక్ష్యం వల్లే తన తల్లి మరణించిందని ఆరోపణ:
అధికారుల నిర్లక్ష్యం వల్లే తన తల్లి మరణించిందని బాధితురాలి కుమారుడు ఆరోపించాడు. కరోనా లేదని చెప్పినా వినకుండా హైదరాబాద్ పంపించారని.. మంచిర్యాలలోనే ఉంచి తగిన చికిత్స అందించి ఉంటే తన తల్లి బతికేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంబులెన్స్‌లో ఆస్పత్రుల చుట్టూ తిరిగే వరకే పుణ్యకాలం గడిచిపోయిందని మండిపడ్డాడు. మరణించిన తర్వాత మృతదేహం అప్పగించడంలోనూ తీవ్ర జాప్యం చేశారని ఆరోపించాడు.
గ్రీన్ జోన్ లో నివాసం ఉండే ఆమెకు కరోనా వైరస్ ఎలా సోకింది?
కాగా ఆమెకు కరోనా వైరస్ ఎలా సోకిందనేది మిస్టరీగా మారింది. కరోనా ఉందని తెలిసి కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. మృతురాలి బంధువులతో పాటు మంచిర్యాల ఆస్పత్రిలో సిబ్బంది కూడా ఆందోళనకు గురవుతున్నారు. అస్వస్థతకు గురైన ఆమెకు స్థానికంగా ఓ వైద్యుడు చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అలర్ట్ అయిన అధికారులు గ్రామస్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణలో 706కి చేరిన కరోనా కేసులు:
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ(ఏప్రిల్ 17,2020) మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 706కి చేరింది. గురువారం (ఏప్రిల్ 16,2020) ఒక్కరోజే 50 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 90శాతం కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 68 మందిని గురువారం డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 496 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 186 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా రాష్ట్రంలో 18మంది మరణించారు.
సూర్యాపేట జిల్లాలో కరోనా టెర్రర్:
గత రెండు రోజులుగా సూర్యాపేట జిల్లాలో భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఆ జిల్లాలో ఇప్పటి వరకు 44 మందికి కరోనా వైరస్ సోకింది. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది. రెడ్ జోన్ మినహా ఆరెంజ్, గ్రీన్ జోన్‌లకు ఏప్రిల్ 20 తర్వాత లాక్‌డౌన్ నుంచి కొంత మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే కేంద్రం ప్రకటించిన ఈ జాబితా కాకుండా.. రాష్ట్రమంతటా కఠినంగా లాక్‌డౌన్‌లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మే 3 వరకు ఎలాంటి సడలింపులు ఇవ్వకూడదని యోచిస్తున్నట్లు సమాచారం. ఏ ఒక్క రంగానికి మినహాయింపు ఇచ్చినా కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం కష్టమని భావిస్తున్నారట. ఏప్రిల్ 19 జరిగే కేబినెట్ సమావేశంలో లాక్‌డౌన్ అమలు, కేంద్రం ప్రకటించిన జోన్‌లపై చర్చించనున్నారు. అదే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి లాక్‌డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశముందని సమాచారం.