ఓట్ల కోసమే మీ రామ జపాలా..? రాములోరి భూముల కబ్జాపై నోరు తెరవరేం : కేటీఆర్

భద్రాద్రి రాములోరి భూముల కబ్జాను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవోపై ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేయడంపై కేటీఆర్ స్పందించారు.

ఓట్ల కోసమే మీ రామ జపాలా..? రాములోరి భూముల కబ్జాపై నోరు తెరవరేం : కేటీఆర్

KTR

Updated On : July 11, 2025 / 12:02 PM IST

KTR: భద్రాద్రి రాములోరి భూముల కబ్జాను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవోపై ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయ సిబ్బంది, ఉద్యోగులు, ఎస్పీ‌ఎఫ్ జవాన్లను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ దాడిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. అయితే, తాజా ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు.

బీజేపీ రామచంద్రా నోరు తెరవరేం..? రాములోరి భూములను ఆక్రమించుకుంటోంటే మాటైనా మాట్లాడరేం..? మీ భాగస్వామి ప్రభుత్వం చెరలో ఉన్నాయని వదిలేస్తున్నారా? లేక ఈసారి మొత్తం భద్రాద్రినే గుంపగుత్తగా వారి చేతిలో పెడదామనుకుంటున్నారా..? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

ఓట్ల కోసమే చేసే మీ రామ జపాలను సీట్ల కోసమే వేసే మీ దొంగ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ప్రధాని మోదీతో మాట్లాడతారో.. మీ దోస్తు దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం. భద్రాద్రిని కాపాడండి.. ఆక్రమణల చెర నుంచి విడిపించండి. అంటూ కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.


మరో ట్వీట్‌లో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు మన తెలంగాణ భద్రాచలం రామచంద్ర ప్రభును చూసేందుకు సమయం లేదా..? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. భద్రాచలం భూమి బీజేపీకి ఎందుకు పవిత్రమైనది కాదు..? ఆంధ్రప్రదేశ్‌లో మీ రాజకీయ కూటమి ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందా? దయచేసి మీ రాజకీయ అనుబంధాలు ఉన్నప్పటికీ మీ గొంతును పెంచండి.. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆక్రమణదారులు ఆక్రమించుకున్న మన భద్రాచలం భూమిని తిరిగి తీసుకురావడానికి పోరాడదాం. అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.