అందరికీ ధన్యవాదాలు, రుణపడి ఉంటా – కవిత

  • Publish Date - October 12, 2020 / 01:20 PM IST

Former TRS MP Kavitha : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు కోసం పాటుపడిన ప్రతిఒక్కరికి కవిత ధన్యవాదాలు తెలిపారు. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు. నేతల సమిష్టి కృషి ఎమ్మెల్యేలు, మంత్రుల సమన్వయంతోనే విజయం సాధించామన్నారు కవిత. మరోవైపు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నేతలు కవితను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.



నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కనివ్వకుండా కవిత విజయ పతాకం ఎగరవేశారు. ఇక్కడ మొత్తం ఓట్లు 824 ఉండగా.. ఒక్క ఓటు మినహా 823 ఓట్లు పోలయ్యాయి. అందులో 728 ఓట్లు కవితకు రాగా.. బీజేపీ అభ్యర్థికి 56, కాంగ్రెస్‌ అభ్యర్థికి 29 ఓట్లు మాత్రమే వచ్చాయి.



పది ఓట్లు చెల్లకుండాపోయాయి. ఇక్కడ కాంగ్రెస్‌ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తిరుగులేని విజయం సాధించిన కవిత.. ఈనెల 14న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.



నిజామాబాద్‌ నుంచే ఎంపీగా 2014లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు కవిత. పార్లమెంటులో తనదైన శైలిలో మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ఆమె.. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఓడిపోవడంతోనే క్రియాశీల రాజకీయాల నుంచి కాస్త దూరంగా ఉన్నారు.



ఎంపీగా ఓడిపోయినా.. కవితను కేసీఆర్‌ రాజ్యసభకు పంపిస్తారని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ రాజ్యసభకు కేకే, సురేష్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ పంపించారు. దీంతో కవిత రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారిందని ప్రత్యర్థి పార్టీ నేతలు చర్చించుకున్నారు. కానీ అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు కవిత. ఎంపీగా సేవలందించిన నిజామాబాద్‌ నుంచే పెద్దల సభకు వెళ్లారు.