Foxconn : తెలంగాణలో తైవాన్ కార్లు..? ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైన ఫాక్స్‌కాన్
ఇప్పటికే అమెరికా, థాయ్ ల్యాండ్ లో రెండు ప్లాంట్లు నెలకొల్పిన ఫాక్స్ కాన్ తన మూడో ప్లాంట్ ఏర్పాటుకు భారత్ ను వేదిక చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది. Foxconn - Telangana

Foxconn - Telangana
Foxconn – Telangana : తైవాన్ ఎలక్ట్రానిక్స్ రంగం దిగ్గజ సంస్థ ఫాక్స్ కాన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా నిలిచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్ ఔట్ సోర్సింగ్ మార్కెట్ పై కన్నేసిన తైవాల్ కంపెనీ ఫాక్స్ కాన్ భారత్ లో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇప్పటికే అమెరికా, థాయ్ ల్యాండ్ లో రెండు ప్లాంట్లు నెలకొల్పిన ఫాక్స్ కాన్ తన మూడో ప్లాంట్ ఏర్పాటుకు భారత్ ను వేదిక చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది.
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్లాంట్ ఏర్పాటుకు ఫాక్స్ కాన్ పరిశీలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. దీనికి కారణం ఫాక్స్ కాన్ కు తెలంగాణతో ఉన్న అనుబంధమే. ఇప్పటికే హైదరాబాద్ సమీపంలోని కొంగరకలాన్ లో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కేంద్రం నిర్మిస్తోంది ఫాక్స్ కాన్.
ఇటీవలే ఇందులో భారీగా పెట్టుబడులు కూడా పెంచింది. గతంలో 1655 కోట్ల పెట్టుబడి పెంచుతున్నట్లు ప్రకటించిన ఫాక్స్ కాన్.. తాజాగా 3వేల 300 కోట్ల అదనపు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. అదే తీరులో ఫాక్స్ కాన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ కూడా తెలంగాణలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే తెలంగాణతో పాటు పోర్టు ద్వారా ఎగుమతులకు, దిగుమతులకు అత్యంత అనువుగా ఉండే తమిళనాడును ఫాక్స్ కాన్ పరిశీలిస్తోంది. కానీ, తమిళనాడుతో పోలిస్తే ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకునే విధానం తెలంగాణకు అనుకూలంగా ఉంది.
పారిశ్రామికంగా తెలంగాణ శర వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వేగంగా స్పందించే తీరు, భౌగోళికంగా అనుకూలమైన పరిస్థితులు.. అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణను స్వర్గధామంగా మార్చేశాయి. దిగ్గజ కంపెనీలు సైతం తెలంగాణకు తరలి వస్తున్నాయి. ఇదే తరహాలో ఫాక్స్ కాన్ కూడా ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణను ఎంచుకుంది. ప్రఖ్యాత ఆపిల్ సంస్థకు 70శాతం ఉత్పత్తులు అందించే ఫాక్స్ కాన్.. ఆపిల్ ఐపాడ్, వైర్ లెస్ ఇయర్ ఫోన్ల తయారీ ఆర్డర్ ను ఇటీవల రూపొందించింది. తెలంగాణ పరిశ్రమలో వేగంగా ఉత్పత్తి ప్రారంభించాలని ఫాక్స్ కాన్ వేసుకున్న ప్రణాళికకు తగ్గట్లుగా ప్రభుత్వం స్పందించింది.
196 ఎకరాల భూమి కేటాయించడంతో పాటు అవసరమైన అనుమతులు శరవేగంగా మంజూరు చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ తయారీ కేంద్ర నిర్మాణం ఊహించిన దానికన్నా వేగంగా సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వ వైఖరి నచ్చడం వల్లే కేంద్రంలో అదనంగా 3వేల 318 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని ఫాక్స్ కాన్ నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కేంద్రం నిర్మాణానికి అనుకూలంగా ఉన్న పరిస్థితులే.. ఫాక్స్ కాన్ ను ఎలక్ట్రిక్ వాహనాల తయారీ హబ్ ఏర్పాటుకు తెలంగాణను పరిశీలించేలా చేస్తున్నాయి. ప్లాంట్ ఏర్పాటు కోసం ఇప్పటికే తెలంగాణ, తమిళనాడుతో చర్చించిన ఫాక్స్ కాన్ త్వరలో నిర్ణయాన్ని ప్రకటించనుంది.
Also Read..Farm loan waiver: రైతులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. రూ.లక్షలోపు రుణాలు మాఫీ
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో ఫాక్స్ కాన్ భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంది. 2025 నాటికి మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో 5శాతం వరకు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. 2025 నాటికి 5లక్షల నుంచి 7లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ చేయాలని భావిస్తోంది. ఫాక్స్ కాన్ ఇప్పటికే అమెరికాలో ప్లాంట్ ఏర్పాటు చేసింది. అమెరికాలోని ఓహియోలో ఏర్పాటు చేసిన ప్లాంట్ కోసం 1908 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఏడాదికి 5లక్షల నుంచి 7 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయనుంది.
థాయ్ లాండ్ స్టేట్ ఎనర్జీ కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ గా ఆ దేశంలో తన రెండో ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 50వేల ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయనుంది. ఏడాదికి లక్షన్నర వాహనాలు తయారు చేసేలా దీన్ని సామర్థ్యం పెంచొచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేస్తారు. థాయ్ లాండ్ తో పాటు దక్షిణాసియాలో టూవీలర్లకు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ ప్లాంట్ లో వాటి తయారీపై దృష్టి పెట్టింది ఫాక్స్ కాన్.