హైదరాబాద్‌లో ఉచితంగా తాగునీరు..ప్రతి కుటుంబానికి 20 వేల లీటర్లు

Free supply of drinking water in Hyderabad : గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఉచిత తాగునీటి హామీని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. నూతన సంవత్సరం తొలి వారం నుంచి హైదరాబాద్‌లో ప్రతి కుటుంబానికి 20 వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా అందించాలని.. మంత్రి కేటీఆర్‌ జలమండలి అధికారులను ఆదేశించారు. ఉచిత తాగునీటి పంపిణీపై మంత్రి కేటీఆర్.. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, జలమండలి ఉన్నతాధికారులతో స‌మీక్ష నిర్వహించారు.

న‌గ‌ర ప్రజ‌ల‌కు సీఎం ఇచ్చిన మాట మేర‌కు డిసెంబ‌ర్ నెలలో కూడా 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు నీటిని ఉచితంగా అందిస్తామన్నారు. ఈ మేర‌కు జ‌న‌వ‌రి నెల‌లో వినియోగ‌దారుల‌కు వ‌చ్చే డిసెంబ‌ర్ నెల బిల్లులో 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు ఛార్జ్ చేయొద్దని అధికారుల‌ను కేటీఆర్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక‌ట్రెండు రోజుల్లో విధివిధానాల‌ను సిద్ధం చేయాల‌ని కేటీఆర్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో హైదరాబాద్ నగరంలో జల మండలి ద్వారా జరుగుతున్న తాగునీటి సరఫరాపై మంత్రి సమీక్షించారు. గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయని.. అందుకు తగ్గట్టుగా నీటి సరఫరా సామర్థ్యాన్ని పెంచుతున్నట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

వచ్చే వేసవికి సైతం సరిపోయే విధంగా నీటి సరఫరా చేసేందుకు ఇప్పటి నుంచే తగిన ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఉచిత తాగునీటికి సంబంధించిన ఏర్పాట్లను రెండు వారాల్లో పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.