Ella Hotel
Gachibowli Car Accident : గచ్చిబౌలి కారు ప్రమాద ఘటనలో చనిపోయిన మహేశ్వరి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఎల్లా హోటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. హోటల్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ఎల్లా హోటల్ యాజమాన్యం దిగి వచ్చింది. మహేశ్వరి కుటుంబాన్ని ఆదుకొనేందుకు యాజమాన్యం అంగీకరించింది. అధికారుల జోక్యంతో హోటల్ యాజమాన్యం స్పందించింది. హోటల్ వద్ద పని చేస్తున్న మహేశ్వరిని కారు ఢీకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. ఈమె గత 15 ఏళ్లుగా ఎల్లా హోటల్ లో పని చేస్తోంది. 20 ఏళ్ల క్రితం ఇదే హోటల్ నిర్మాణ పనుల్లో ప్రమాదవశాత్తు మహేశ్వరి భర్త చనిపోయాడు. ప్రస్తుతం మహేశ్వరి కూడా చనిపోవడంతో ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
Read More : Gachibauli Car Accident : గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని మహిళ మృతి
నిన్న జరిగిన గచ్చిబౌలి కారు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. నిన్న గచ్చిబౌలిలో జరిగిన కారు ప్రమాదంలో గాయత్రి, మహేశ్వరి మృతిచెందగా.. రోహిత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోహిత్ పరిస్థితి.. ఆందోళనకరంగా ఉంది. అటు కాసేపట్లో గాయత్రి, మహేశ్వరి మృతదేహాలకు .. ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. గచ్చిబౌలి కారు ప్రమాదానికి డ్రంక్ అండ్ డ్రైవ్ కారణమని పోలీసులు తేల్చారు. కూకట్‌పల్లి హెచ్‌ఎంటీ కాలనీలో నివాసం ఉండే రోహిత్ .. ఎంబీబీఎస్ పూర్తిచేసి.. బియ్యం గోదాములు నిర్వహిస్తున్నాడు. అటు కేపీహెచ్‌బీ కాలనీ ఈడబ్ల్యూస్‌లో నివాసముండే గాయత్రి షార్ట్‌ఫిల్మ్స్ చేస్తోంది. వీరిద్దరూ కలిసి హోలీ వేడుకల్లో పాల్గొని .. నిన్న సాయంత్రం గచ్చిబౌలి వైపు వస్తుండగా వారి కారు ప్రమాదానికి గురైంది. టిమ్స్ సమీపంలోని ఎల్లా హోటల్ వద్ద అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కకు దూసుకొచ్చి .. ఫుట్‌పాత్‌పై బోల్తా కొట్టింది.
Read More : HYD Crime : గచ్చిబౌలిలో దారుణం.. తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కొడుకు
దీంతో అక్కడ మొక్కలకు నీళ్లు పడుతున్న మహేశ్వరి అనే మహిళను కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అటు కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గాయత్రి మృతి చెందింది. ఇక తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న రోహిత్ పరిస్థితి విషమంగా ఉంది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, అతివేగంతో వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణంగా కనిపిస్తోంది. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, వేగం వద్దు.. ప్రాణం ముద్దంటూ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేసినా.. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. చెప్పేది మాకు కాదులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.