Ganesh Nimajjanam 2022 : హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్.. ఎన్ని రోజులు అంటే..
మరోవైపు గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నగరంలో రెండు రోజుల పాటు వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసు శాఖ ఆదేశించింది. మద్యం అమ్మకాలపై పోలీసు శాఖ ఆంక్షలు పెట్టింది.

Ganesh Nimajjanam 2022 : గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రకు హైదరాబాద్ లో సర్వం సిద్ధం చేశారు అధికారులు. గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు పోలీసులు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
మరోవైపు గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నగరంలో రెండు రోజుల పాటు వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసు శాఖ ఆదేశించింది. మద్యం అమ్మకాలపై పోలీసు శాఖ ఆంక్షలు పెట్టింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు జరపరాదని పోలీసులు తేల్చి చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. అలాగే బార్లు, స్టార్ హోటళ్లు, క్లబ్ లు కూడా మూసేయాలని పోలీసులు ఆదేశించారు.
గణేశ్ నిమజ్జనం కోసం ప్రధాన శోభాయాత్ర జరిగే మార్గాన్ని పోలీసులు విడుదల చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఊరేగింపు మార్గాలు, ఇతర వాహనాలు వెళ్లేందుకుగాను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా మార్గాల్లో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ఇతర వాహనాలను అనుమతించరు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన లారీలను శుక్రవారం ఉదయం నుంచి 24 గంటల పాటు నగరంలోకి రానివ్వరు. ఇక రాజధానిలో గణేశ్ సామూహిక నిమజ్జనానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
పోలీసు శాఖ తాత్కాలిక కంట్రోల్ రూములు ఏర్పాటు చేయగా, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు భక్తులు, సందర్శకులకు అనుకూలంగా ఉండేలా తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారు. అలాగే హుస్సేన్ సాగర్ సహా గ్రేటర్ పరిధిలోని చెరువులు, కొలనులు, బేబీ పాండ్ల వద్ద మొత్తం 280 క్రేన్లు అందుబాటులోకి తెచ్చారు. బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర ఉదయం 10గంటలకు మొదలవుతుందన్నారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం మధ్యాహ్నం వరకు పూర్తవుతుందన్నారు.