బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం.. సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ

Girl repeatedly raped .. Shooting on cell phone : శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీసుస్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. బాలికను మాయమాటలతో లోబరుచుకొని బెదిరింపులకు గురిచేసి కామాంధుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆలస్యంగా సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్‌ లోని బహ్రయిన్‌ జిల్లాకు చెందిన గోపి ఉపాధ్యాయ(24) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి శంషాబాద్‌లోని సిద్దేశ్వర కాలనీలో నివసిస్తున్నాడు. పెయింటర్‌గా పని చేసేవాడు. కాగా అదే ఇంట్లో అస్సాంకు చెందిన మరో కుటుంబం అద్దెకు ఉంటుండగా.. వీరి బంధువులు నగరంలో ఉండేవారు. అయితే అక్టోబర్‌ 11న అస్సాంకు సొంత పనిమీద వెళ్తూ వారి ఇద్దరు కూతుళ్లను సిద్దేశ్వర కాలనీలోని బంధువుల వద్ద వదిలి వెళ్లారు.

ఈ నేపథ్యంలో గోపి వారిపై కన్నేశారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఓ బాలికను బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలను తన సెల్‌ఫోల్‌లో చిత్రీకరించాడు. ‘నా దగ్గర గన్‌ ఉంది.. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల్లిదండ్రులను చంపేస్తా’.. అంటూ భయపెడుతూనే.. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

అయితే నగరంలోని తమ ఇంటికి వెళ్లాక అస్వస్థతకు గురైన బాలిక తమ కుటుంబీకులకు అసలు విషయం చెప్పింది. వెంటనే శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.