Telangana RTC Employees : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
Telangana RTC Employees : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
Telangana RTC employees
Telangana RTC Employees : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ సమ్మె సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు జులై 1 నుంచి 11శాతం ఫిట్మెంట్ అమలు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని, నాగర్ కర్నూలు, పెద్దపల్లి డిపో పనులు వేగవంతం చేయాలని అధికారులతో సమావేశంలో ఆదేశించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి శంకర్ కుటుంబానికి రూ.కోటి చెక్కు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు అందించాలని సూచించారు.
గురువారం టీజీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పొన్నం మాట్లాడుతూ.. పెండింగ్ కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తొలగించిన ఉద్యోగుల్లో 244 మందికి ఇప్పటికే విధుల్లోకి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.
నాగర్‌కర్నూల్, పెద్దపల్లి బస్‌డిపో పనులను వేగవంతం చేయాలని మంత్రి పోన్నం అధికారులను ఆదేశించారు. హుజూర్ నగర్, కోదాడ, నాగర్ కర్నూల్ బస్ స్టేషన్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మంత్రి.. వేములవాడ, కథలాపూర్ బస్ స్టేషన్లకు త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుందని, ములుగు బస్ స్టేషన్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మహాలక్ష్మీ పథకంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మహిళా సంఘాలకు చెందిన 553 బస్సుల పనితీరుపై మంత్రి నివేదిక కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో 1,050 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. ఆర్టీసీ వద్ద 10,773 బస్సులు.. 38,128 మంది ఉద్యోగులు ఉన్నారని, రోజుకు 61లక్షల మంది ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ సేవలు పొందుతున్నట్లు మంత్రి తెలిపారు.
