Gossip Garage Mlc Elections (Photo Credit : Google)
Gossip Garage : కుర్చీ దక్కించుకోవాలి.. చట్టసభల్లో అడుగు పెట్టాలి.. దీని కోసం పొలిటికల్ లీడర్లు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ.. తనదైన రోజు కోసం, అవకాశం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తుంటారు. అలాంటి రోజే.. మరికొన్ని నెలల్లో రాబోతోంది. తెలంగాణ శాసన మండలిలో.. వచ్చే ఏడాది మార్చి నుంచి మే వరకు దాదాపు 9 స్థానాలు ఖాళీ కాబోతున్నాయ్. ఇందులో మెజారిటీ స్థానాలను అధికార కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది. దీంతో హస్తం పార్టీలో నేతలంతా ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. ఇంతకీ ఎమ్మెల్సీ రేసులో ఉంది ఎవరు.. ఎవరికి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయ్.
మార్చిలో మండలిలో భారీగా స్థానాలు ఖాళీ..
పార్టీ పదవి అయినా.. ప్రభుత్వంలో పదవులు అయినా.. కాంగ్రెస్‌లో సీటు ఫైట్ క్రియేట్ చేసే ఇంట్రస్ట్ అంతా ఇంతా కాదు. వచ్చే ఏడాది మార్చిలో.. శాసనమండలిలో భారీగా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయ్. దీంతో పదవుల యుద్ధం ఇంకెంత ఆసక్తి రేపుతుందో అనే చర్చ… రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మార్చి నుంచి మే వరకు మొత్తం 9 స్థానాలు ఖాళీ కాబోతున్నాయ్. వీటిలో రెండు టీచర్స్ కోటాలో.. ఒకటి గ్రాడ్యుయేట్ కోటాలో.. మరొకటి హైదరాబాద్ లోకల్ బాడీలో ఖాళీ అవుతుంది. మిగతా ఐదు స్థానాలు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ కాబోతున్నాయ్. టీచర్స్ కోటాలోని రెండు స్థానాలను పక్కన పెడితే… మిగతావన్నీ పొలిటికల్‌గా పోటీ చేయాల్సిందే. మిగతా ఏడు సీట్ల కోసం కాంగ్రెస్‌లో ఇప్పుడు రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది.
ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ సీట్ల కోసం భారీ పోటీ..
టీచర్లు, గ్రాడ్యుయేట్, లోకల్‌బాడీ కోటా సంగతి ఎలా ఉన్నా.. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెస్‌లో భారీ పోటీ కనిపిస్తోంది. పొత్తుల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న నేతలతో పాటు.. మరికొందరికి హామీలు ఇచ్చింది పార్టీ అధిష్టానం. దీంతో ఈసారి అవకాశం ఎవరికి దక్కుతుందా అనే ఆసక్తి కనిపిస్తోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ కోటాలో ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే మార్చిలో ఈ స్థానం ఖాళీ అవుతోంది. ఐతే ఈ కోటాలో ఎమ్మెల్సీ పోటీకి తాను దూరంగా ఉంటానని జీవన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించగా.. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు, కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు.. ఈ సీటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరిలో ఎవరికి చాన్స్ దక్కుతుందన్నది ఆసక్తి రేపుతోంది.
ఒక సీటు అద్దంకి దయాకర్‌కు ఫిక్స్!
ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలు ఖాళీ కాబోతున్నాయ్. వీటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించాల్సి ఉంది. ఇక ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో.. ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ఒక సీటు దక్కబోతోంది. మిగిలిన మూడు స్థానాల కోసం భారీ పోటీ కనిపిస్తోంది. ఇందులో ఒక సీటు.. అద్దంకి దయాకర్‌కు ఫిక్స్ అయింది. అసెంబ్లీతో పాటు గతంలో ఓసారి ఎమ్మెల్సీ స్థానం అద్దంకికి మిస్ అయింది. దీంతో ఈ దఫా.. కచ్చితంగా అద్దంకిని మండలికి పంపించడం ఖాయం. ఇక మిగిలినవి రెండు స్థానాలు. వీటి కోసం ఆరుగురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు.
ఎమ్మెల్సీగా మాజీ కానున్న జీవన్‌రెడ్డి.. ఓ స్థానం కోసం భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్.. బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో సీనియర్ నేతగా తనకు ప్రయారిటీ ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి జీవన్ రెడ్డి విన్నపాలు పెట్టుకుంటున్నారు. ఇక మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసిన నీలం మధుతో పాటు.. కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం టికెట్ త్యాగం చేసిన జగదీశ్వరరావు కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం గట్టి పట్టు పడుతున్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా తీసుకోని జగదీశ్వరరావు.. తనకు ఎమ్మెల్సీ పదవి కావాల్సిందేనని అంటున్నారని తెలుస్తోంది.
సంపత్‌కుమార్, చరణ్ కౌశిక్, హరివర్ధన్ రెడ్డి ప్రయత్నాలు..
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.. ఎమ్మెల్సీ చాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో అతిపెద్ద మాదిగ సామాజికవర్గం నుంచి తనకు ఛాన్స్ కావాలని పట్టుబడుతున్నారు. ఇక పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో కురుమ, యాదవ సామాజికవర్గం నుంచి ఒకరికి కూడా చాన్స్ దక్కలేదు. దీంతో ఎమ్మెల్సీగా యాదవ సామాజికవర్గానికి చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఐతే త్వరలో మంచి అవకాశాలు కల్పిస్తామని ఆ టైమ్‌లో కూల్ చేసింది పార్టీ అధిష్టానం. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించాలని హైకమాండ్ దగ్గర విన్నపాలు వినిపిస్తున్నారు. సో.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ స్థానం కోసం జరుగుతున్న ఫైట్.. రసవత్తరంగా మారుతోంది. జాక్‌పాట్ కొట్టేది ఎవరు.. లక్కీ చాన్స్ దక్కేది ఎవరికి అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.
Also Read : సీఎం రేవంత్‌ను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ భారీ వ్యూహం..! కేటీఆర్ పాదయాత్ర అక్కడి నుంచేనా?