Gossip Garage : కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్.. వనపర్తిలో ఆ ఇద్దరి మధ్య ముదిరిన వివాదం..

అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. బీఆర్ఎస్ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారంటూ… తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారట.

Gossip Garage : ఆధిపత్య పోరు.. ఆ నియోజకవర్గంలో పార్టీని రెండు ముక్కలు చేసింది. ఎమ్మెల్యేకి, ప్రొటోకాల్ పోస్ట్‌లో ఉన్న నాయకుడికి యుద్ధం జరుగుతోంది. పాత, కొత్త వైరం కలిసి.. వివాదం ముదిరింది. ఏకంగా మంత్రి ముందే.. ఇద్దరు నేతలు రచ్చకు దిగారు. ఈ వర్గపోరు పార్టీకి కొత్త తలపోటుగా మారింది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. ఎవరా ఇద్దరు నేతలు.. వాళ్ల మధ్య వివాదం ఏంటి.. విభేదాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయ్‌.

వనపర్తి కాంగ్రెస్‌లో వార్‌.. ఇదే ఇప్పుడు హస్తం పార్టీ శ్రేణులను టెన్షన్ పెడుతోంది. ఇద్దరు నేతల మధ్య యుద్ధం పీక్స్‌కు చేరుకుందనే టాక్ వినిపిస్తోంది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య పంచాయితీ.. ఓ రేంజ్‌లో నడుస్తోందట.

2023 ఎన్నికల్లో చిన్నారెడ్డిని కాదని… బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన మేఘారెడ్డికి టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. దీనిపై అప్పట్లో రకరకాల విశ్లేషణలు వినిపించాయ్‌. ఇదంతా ఎలా ఉన్నా.. విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు మేఘారెడ్డి. ఆ తర్వాత చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టింది ప్రభుత్వం. ఐతే ఆ తర్వాతే మొదలైంది అసలు సమస్య.

Also Read : తెర మీదకి మళ్లీ ఫైర్ బ్రాండ్..! రాములమ్మ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అంటూ మీనాక్షి ఆరా!

నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు మేఘారెడ్డి ప్రయత్నం మొదలుపెట్టారు. అదే సమయంలో పట్టు తగ్గకుండా చిన్నారెడ్డి జాగ్రత్తపడ్డారు. ఇక్కడే వ్యవహారం బెడిసికొట్టింది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అనే పరిస్థితులు కనిపించాయ్‌. తమ మాటే నెగ్గాలని ఎవరికివారు పట్టిన పట్టు వీడలేదు. దీంతో వనపర్తిలో వర్గపోరు కనిపించింది. ఇలాంటి పరిణామాల మధ్య మంత్రి తుమ్మల వనపర్తి టూర్‌ వివాదాన్ని మరింత పెంచింది.

కాంగ్రెస్ లో కలకలం రేపిన చిన్నారెడ్డి వ్యాఖ్యలు..
గోపాల్‌పేట, ఖిలా ఘనపురం మార్కెట్‌ ఏర్పాటు, స్థల ఎంపిక విషయంలో మంత్రి ముందు చిన్నారెడ్డి నిరసనకు దిగారు. ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి మాటున ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. తాను పెట్టిన రాజకీయ భిక్షతో మేఘారెడ్డి ఎమ్మెల్యే అయ్యారంటూ చిన్నారెడ్డి బహిరంగంగా మాట్లాడిన మాటలు.. కాంగ్రెస్‌లో కలకలం సృష్టించాయ్.

రెండు రోజుల కింద జరిగిన సీఎం రేవంత్ వనపర్తి సభ తర్వాత కూడా విభేదాలు మరోసారి తెరమీదకు వచ్చాయ్‌. సీఎం వేదికపై తనకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేని.. పార్టీ ముఖ్యనేతల ముందు చిన్నారెడ్డి వాపోయారని సమాచారం. ఇక ఆయనకు, ఆయన వర్గానికి.. ఎమ్మెల్యే మేఘారెడ్డి టీమ్ గట్టిగానే కౌంటర్ ఇస్తోందని తెలుస్తోంది.

అభివృద్ధిని చిన్నారెడ్డి అడ్డుకుంటున్నారని.. బీఆర్ఎస్ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారంటూ… తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారట. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు రాష్ట్రం మొత్తానికి కాకుండా… వనపర్తికి మాత్రమే పరిమితమై.. డిస్టర్బెన్స్‌గా మారుతున్నారని ఎమ్మెల్యే వర్గం ఓ రేంజ్‌లో ఫైర్ అవుతోందని తెలుస్తోంది.

ఇద్దరి మధ్య వర్గపోరు ఎలా ఉన్నా.. చిన్నారెడ్డి తీరుపై పార్టీ సర్కిల్స్‌లోనూ చర్చ జరుగుతుందనే టాక్‌ వినిపిస్తోంది. సీనియర్ నాయకుడై ఉండి.. మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఏంటనే చర్చ జరుగుతోందట. దీన్ని ఎమ్మెల్యే మేఘా రెడ్డి వర్గం ఆయుధంగా చేసుకుందనే చర్చ జరుగుతోంది. ఇదేనా అనుభవం, ఇదేనా సీనియర్ నాయకుడి క్రమశిక్షణ అంటూ చిన్నారెడ్డి టార్గెట్‌గా విమర్శలు సంధిస్తోందట.

Also Read : మొన్న వంశీ.. నిన్న పోసాని.. వైసీపీలో నెక్ట్స్ అరెస్ట్ రజినిదేనా? ఏసీబీ కేసులో బిగుస్తున్న ఉచ్చు..

చిన్నారెడ్డి పాత వీడియో తెగ వైరల్..
చిన్నారెడ్డి పాత వీడియో ఒకటి.. తెగ వైరల్ చేస్తున్నారు. ఆయన వనపర్తి ఎమ్మెల్యేగా ఉండి.. నిరంజన్ రెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు రాష్ట్రానికా, వనపర్తికా అంటూ చిన్నారెడ్డి ప్రశ్నించిన వీడియోను.. ఇప్పుడు ఎమ్మెల్యే టీమ్ షేర్ల మీద షేర్లు చేస్తోందని టాక్. చిన్నారెడ్డి ప్రశ్న ఇప్పుడు ఆయనకు వర్తించదా అని కొత్త చర్చకు తావిస్తోంది. ఏమైనా వనపర్తి వార్ ఓ రేంజ్‌కు చేరుతోంది. పార్టీ పెద్దలు దీనికి ఎలా చెక్‌ పెడతారో మరి!