Gossip Garage: వాళ్లా? మేమా? ఎవరు కావాలో తేల్చుకోండి.. ఓరుగల్లు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ..
ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లతో సంప్రదింపులు జరుపుతూనే..పార్టీ అధిష్టానం పెద్దల దగ్గర తమ వాదనను బలంగా వినిపించేందుకు రెడీ అవుతున్నారట.

Gossip Garage: ఓరుగల్లు కాంగ్రెస్ లొల్లి నెక్స్ట్ లెవల్‌కు చేరింది. ఏ స్థాయికి అంటే పార్టీలో ఉంటే కొండా దంపతులన్నా ఉండాలి. లేకపోతే మేమైనా ఉండాలన్నట్లుగా పట్టుబడుతున్నారట ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కొండా సురేఖ దంపతుల ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయకపోతే తాము పార్టీలో ఉండలేమని తేల్చి చెప్పారట. పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన నేతలు..కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చాలని కోరారట.
ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి గంపగుత్తగా..మీనాక్షికి ఫిర్యాదు చేశారట. కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తలదూరుస్తూ, అడ్డగోలుగా మాట్లాడుతూ వివాదాలు సృష్టిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారట. కొండా దంపతులతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా..రాతపూర్వకంగా రాసిచ్చారట.
ఆ తర్వాత వరంగల్ కాంగ్రెస్ పంచాయితీపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లురవితో డిస్కస్ చేశారట మీనాక్షి. వరంగల్ నేతల మధ్య విభేదాలపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని సూచించారట. వరంగల్‌కే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో నేతల మధ్య ఎక్కువగా విభేదాలున్నాయనే అంశంపైనా ఆమె వివరాలు అడిగినట్లు తెలుస్తోంది.
వరంగల్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీతో పాటు పలువురు నేతలు మీనాక్షి నటరాజన్‌కు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవికి తమపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో..తగిన సమాధానం ఇచ్చేందుకు కొండా దంపతులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తనపై ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెవిలో వేసినట్లు సమాచారం. అవసరమైతే మీనాక్షి నటరాజన్‌ను కూడా కలిసే యోచనలో ఉన్నారట కొండా దంపతులు.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లురవికి కూడా లిఖిత పూర్వకంగా తమ వెర్షన్ తెలియజేసేందుకు రెడీ అవుతున్నారట. లేటెస్ట్ ఇష్యూకు సంబంధించి కొండా దంపతులు..పార్టీలోని సీనియర్ లీడర్లతో టచ్‌లో ఉన్నట్లు టాక్. కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ నేతలు..తమ సాయంతో ఎమ్మెల్యేలుగా గెలిచి తమపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని పార్టీలోకి కీలక నేతలకు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్నారట కొండా దంపతులు. సేమ్‌టైమ్ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తే..ఆ స్థానంలో జిల్లా నుంచి సీనియర్లలో ఎవరో ఒకరికి అవకాశం వస్తుందని కుట్ర చేస్తున్నారని కూడా కొండా దంపతులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లబోతున్నారట.
గతంలో టీడీపీలో పని చేసి..ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అవుతున్న వారంతా టీమ్‌గా ఏర్పడి తమపై కుట్ర చేస్తున్నారనేది కొండా దంపతుల వాదన. సీఎం కోటరీతో కలిసి కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి చేస్తున్న మంత్రాంగమంతా తమకు తెలుసని అంటున్నారట. ఈ విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు లాంటి నేతలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారట కొండా దంపతులు. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లతో సంప్రదింపులు జరుపుతూనే..పార్టీ అధిష్టానం పెద్దల దగ్గర తమ వాదనను బలంగా వినిపించేందుకు రెడీ అవుతున్నారట. కొండా వర్సెస్ ఎమ్మెల్యేల ఇష్యూలో ఎవరు పైచేయి సాధించబోతున్నారు? ఈ పంచాయితీని కాంగ్రెస్ పెద్దలు ఎలా తెంచబోతున్నారో చూడాలి.