2 స్టేట్స్ @ 47 : మండే ఎండలతో వణికిన జనం

  • Published By: veegamteam ,Published On : May 11, 2019 / 10:15 AM IST
2 స్టేట్స్ @ 47 : మండే ఎండలతో వణికిన జనం

Updated On : May 11, 2019 / 10:15 AM IST

తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 8గంటల నుంచే ఎండలు నిప్పుల కొలిమిలా మారడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 46 నుంచి 48 డిగ్రీలు మధ్య నమోదు అయ్యింది. ఇది సాధారణం కంటే 7 డిగ్రీలు అదనం. దీనికితోడు వడగాలులు ఉండటంతో.. జనం అల్లాడిపోయారు. ఇంట్లో ఉన్నా కూడా ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరో 42 ప్రాంతాల్లో టెంపరేచర్ 42 నుంచి 46 డిగ్రీలుగా నమోదు అయ్యింది. 85 ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీలుగా ఉంది ఉష్ణోగ్రత. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా 480 ప్రాంతాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఎండ తీవ్రత ఉంది.

ఏపీలో ప్రకాశం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండ ఎలా ఉంటుందో చూశారు ప్రకాశం జిల్లా ప్రజలు. అత్యధికంగా 48 డిగ్రీలు నమోదు అయ్యింది. మండే ఎండ, వడగాలులు, ఉక్కబోత అన్నీ కలిపి ఏపీ ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ఇవేం ఎండలు అంటూ జనం వణికిపోయారు. బయటకు రాలేరు.. ఇంట్లో ఉండలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బయట కాలు పెట్టటానికే వీలు లేనంతగా బండలు కాలిపోయాయి. నెత్తిన ఎండ, కాళ్ల కింద మంటలు.. బయటకు రావాలంటనే భయపడిపోయారు. ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లు, దర్శిలలో వడగాల్పుల ధాటికి తట్టుకోలేక ఐదు మంది మృతి చెందారు. కంభంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.

గుంటూరు జిల్లాలో భానుడి భగభగలకు జనం విలవిల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎన్నడూ లేని విధంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో….జనం ఠారెత్తిపోతున్నారు. సత్యసాయి సేవా సమితి సభ్యులు…ప్రజలకు మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. 

తెలంగాణలోనూ రాష్ర్టంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనుల ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో మిగతా ప్రాంతాల కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. అయినా సింగరేణి యాజమాన్యం పని వేళలు మార్చటం లేదు. పని ప్రదేశాల్లో ఎండల తీవ్రత పెరిగింది. విధులు నిర్వహించలేకపోతున్నారు. ఖమ్మం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లిలో కార్మికుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. విధులు చేయలేం అంటూ సెలవులు పెడుతున్నారు. సింగరేణి ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. 

హైదరాబాద్ లో భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండలు మండుతున్నాయి. తీవ్రస్థాయిలో వడగాల్పులు వీస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రత కొనసాగుతూనే ఉంది. పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డు అవుతున్నాయి. రాత్రి పూట ఉక్కపోతతో నగర వాసులు అల్లాడుతున్నారు. మరిన్ని రోజులు ఎండుల ఇలాగే ఉంటాయని..నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్ లో శుక్రవారం (మే10, 2019)న 42 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదు అయింది.